ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో కురిసిన వర్షం కారణంగా వాతావరణం చాలా చల్లగా మారిపోయింది. అక్కడికి వచ్చిన నాయకులందరూ చలిని తట్టుకొనే క్రమంలో భాగంగా తగిన ఏర్పాట్లలో వచ్చారు. కానీ వారు మెల్లగా పది రోజుల వెనుకటి రోజులను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటే వారి శరీరం వేడెక్కడం ఖాయం. ఎందుకంటారా ఎన్నికల సంఘం ఢిల్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది పది రోజుల క్రితమే కాబట్టి.

‘తాంబూలాలిచ్చాం ఇక తన్నుకు చావండి’ అన్నట్టుగా ఎన్నికల సంఘం తమ పనిని కానిచ్చి రాజకీయ నాయకుల వ్యూహాలకు, నోటికి పనిచెప్పింది. ఢిల్లీ ఎన్నికల నగారా మ్రోగింది. అన్ని పార్టీల నాయకులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించేసారు. మొన్నటి ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించి కాంగ్రేస్‌ సహాయంతో కొన్ని రోజుల వరకు ఢిల్లీని పరిపాలించింది. కానీ దాని తర్వాత దానిని నిలుపుకోవడంలో విఫలం కావడం వలన మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.

అయితే మొన్నటి ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉండగా ఈ సారి ఎన్నికల్లో మాత్రం ద్విముఖ పోటీ మాత్రమే ఉంటుంది. అదీ భాజపా, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్యే యుద్ధం. ఫిబ్రవరి పదో తేదీన ప్రజలు ఎలా తీర్పును వెలువరిస్తారో అని అందరికీ ఉత్కంఠను రేకెత్తిచే అంశం. పోయిన ఎన్నికల్లో ఆప్‌కి కొద్దిగా అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ దానిని పూర్తికాలం అరవింద్‌ కేజ్రీవాల్‌ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీనితో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ ఎన్నికల్లో, ఇటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మాంచి ఊపుమీదున్న భాజపాకు హస్తిన ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాల్సిందే. మోదీ చరిష్మా, అమిత్‌షా వ్యూహం రెండూ కలిసి భాజపాను విజయతీరాన నడిపిస్తాయనే ఆశతో కార్యకర్తలున్నారు.

పోయిన ఎన్నికల్లో గెలిచిన అరవింద్‌ కేజ్రీవాల్‌ మురికివాడల్లో నివసిస్తున్న పేద ప్రజలను బాగా ఆకర్షించగలిగాడు. ఉచిత మినరల్‌ వాటర్‌, విద్యుత్‌ బిల్లుల తగ్గింపు లాంటి హామీలతో సాధారణ ప్రజలను తనవైపు లాక్కున్నాడు. పోయిన సారి కొద్ది రోజులు మాత్రమే పరిపాలన ఇచ్చానని ఈ సారి మాత్రం అలా కాకుండా పూర్తికాలం తన పరిపాలనను ఇస్తానని కేజ్రీవాల్‌ ఢిల్లీ ప్రజలకు మాటిచ్చాడు. ”పాంచ్‌ సాల్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌” అనే పోస్టర్లు ఇప్పటికే ఢిల్లీ అంతటా విస్తరించాయి. కానీ ఇంతటి ఓటు బ్యాంకును సాధించుకున్న కేజ్రీవాల్‌ ప్రజల మనస్సులను ఆకర్షించేలా పరిపాలన చేయగలుగుతాడా అంటే కొంత అనుమానమే.ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ధర్నాలు చేయడం, అలాగే మొన్నటికి మొన్న ప్రచారంలో స్థాయికి తగినటువంటి మాటలు మాట్లాడకుండా అనవసరపు మాటలు మాట్లాడడం వలన అతని హుందాతనం తగ్గిపోయింది. ఇది కొంత ఇబ్బందికరమైన అంశం. ఆప్‌కి కేజ్రీవాలే ప్రచారకర్త. ఇది ఆప్‌కి బాగా కలిసివచ్చే అంశం. కిరణ్‌బేడీ చేరేంత వరకు భాజపాకి సరైన ముఖ్యమంత్రి అభ్యర్థి దొరకనే లేదు. ప్రధాని మోదీ ఒక్కటే ప్రచార కర్త. దేశ రాజకీయాలు వేరే, రాష్ట్ర రాజకీయాలు వేరే. కానీ భాజపాలో ఉన్న హర్షవర్ధన్‌, విజయ్‌గోయల్‌ లాంటి నాయకులు రాజ్యసభకు వెళ్ళడంతో భాజపాకు నాయకులు కరువైయ్యారు. అప్పుడు ఆలోచనలో పడ్డ వ్యూహకర్తలు కిరణ్‌బేడీని తెరపైకి తెచ్చారు.ఈమె లోక్‌పాల్‌ బిల్లులో అన్నాహజారేతో కలిసి పోరాడిన నాయకురాలు. అందరికీ ఐ.పి.యస్‌. అధికారిగా సుపరిచితురాలు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. పైగా సమర్థవంతంగా పరిపాలించిన మాజీ పోలీసు అధికారిణి. ఇవన్నీ చూసుకొని వ్యూహకర్తలు ఈమెను తెరపైకి తెచ్చారు. ఈమెతో పాటు ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, ఆప్‌ మాజీ నాయకురాలైన షాజియా ఇల్మీకి కూడా భాజపా తీర్థాన్నిచ్చారు. దీనితో ప్రత్యర్థి అయిన కేజ్రీవాల్‌ కిరణ్‌బేదీ పై ఎలాంటి ఆరోపణలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. కాబట్టి అంత ఘాటైన విమర్శలు ఇప్పటివరకైతే లేవు.

పేద ప్రజలను తన ఓటుబ్యాంకుగా మల్చుకోవడంలో విజయం సాధించిన కేజ్రీవాల్‌ ఈసారి మాత్రం కొంత ఇబ్బంది పడాల్సి రావచ్చని నా అభిప్రాయం. ఎందుకంటే కొన్ని రోజుల క్రితము బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు గ్రామీణాభివృద్ధి మంత్రి హోదాలో ఢిల్లీలోని మురికివాడలలో నివసిస్తున్న పేదప్రజల ఇళ్ళ స్థలాలను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. దీనితో ప్రధాని మోదీ కూడా ఈ సభలో వెంకయ్య నాయుడును మెచ్చుకున్నారు. దీనితో కేజ్రీవాల్‌ ఓటు బ్యాంకుకు దెబ్బ పడినట్లే. కాబట్టి మురికివాడలోని పేద ప్రజల వద్దకు కమలం చేరుతుందేమోనని నా అంచనా. వీటితో పాటు కాంగ్రేస్‌ హయాంలో దిల్లీలో అమ్మాయిలపై జరిగిన అత్యాచారాలతో విసిగిపోయిన జనం ఈసారి గట్టి పోలీసు అధికారిణి కిరణ్‌బేదీని చూసి కొద్దిగా భాజపా వైపు మొగ్గే అవకాశాలు మెండు. వీటితో పాటు ఐటీ, మధ్యతరగతి ప్రజలు, యువకులు ముందునుంచీ భాజపా, మోదీ ఓటుబ్యాంకుగా కొనసాగుతూ వస్తున్నారు. కానీ త్రిలోక్‌పురిలో జరిగిన అల్లర్ల విషయమే భాజపాని కొంత ఇబ్బందికి గురిచేయవచ్చు.ఈ ఓట్లు కాంగ్రేస్‌ ఖాతాలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. నిమ్నస్థాయి వర్గాల వారిని తనవైపు తిప్పుకోవడానికి త్రిలోక్‌పురిని అమిత్‌షా వాడారా అన్నది అనుమానం. ఎందుకంటే హిందువులం అనే సెంటిమెంట్‌ ఉన్నత వర్ణాలలో ఉన్నట్టుగా నిమ్న వర్ణాలలో అంతగా కనిపించదు. కానీ వారి ఓట్లనూ రాబట్టాలనే ఉద్దేశ్యంతో ఎస్సీ, ఎస్టీ ప్లస్‌ (+) హిందుత్వాలను కలిపి భాజపా వాడే ప్రయత్నం చేసింది. అది ఎంత వరకు కలిసి వస్తుందో కొంత అనుమానమే.

ఇక కాంగ్రేస్‌ ఈ పోటీలో వెనకంజే. ఎందుకంటే వరుస ఓటములతో ఖంగు తింటున్న కాంగ్రేస్‌ ఈ సారి దిల్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అరవింద్‌ కేజ్రీవాల్‌, కిరణ్‌బేదీలో ఆప్‌కి, భాజపాకు ఉన్నారు. వీరిద్దరూ ప్రజల్లో ఛరిష్మా ఉన్న నాయకులే. కానీ కాంగ్రేస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి అజయ్‌ మాకెన్‌ మాత్రం ఛరిష్మా ఉన్న నాయకుడు కాడు. పైగా షీలా దీక్షిత్‌ నాయకత్వంలో కాంగ్రేస్‌ పార్టీపై అవినీతి ముద్ర పడింది. ప్రజలు విసిగిపోయారు. దీనితో కాంగ్రేస్‌ వికసించే పరిస్థితే లేదు. దీనితో పాటు కాంగ్రేస్‌ జాతీయ స్థాయిలో నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాహుల్‌గాంధీ ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి యుద్ధంలో కాంగ్రేస్‌ పార్టీ మూడో స్థానమే.

అన్ని ఎన్నికల్లో వివిధ పార్టీల ఓటు బ్యాంకులు వేర్వేరుగా ఉంటాయి. కానీ ఈసారి దిల్లీ ఎన్నికల్లో మాత్రం అన్ని పార్టీల ఓటుబ్యాంకులు మాత్రం ఒకటే. అన్ని పార్టీల నాయకులు దిల్లీలోని మురికివాడలలో ఉన్న సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజల ఓట్ల కోసం అన్ని పార్టీలూ క్యూ కట్టాయి. దటీస్‌ కామన్‌ మ్యాన్‌. బహుశా మొన్ననే మరణించిన ”కామన్‌ మ్యాన్‌” సృష్టి కర్త ఆర్కే లక్ష్మణ్‌ ఎక్కడున్నా చాలా సంతోషపడుతూ ఉంటాడేమో.

Srinath Rao

He is a Journalist by profession. Alma mater of A.P.College of Journalism. Teaches Journalism. He has strong passion for politics. Aspires to be a Political Leader. He is undergoing leadership training at IIPL (Indian Institute of Political Leadership)
Srinath Rao

One thought on “ఒకే ఓటు బ్యాంకు – రెండు పార్టీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *