చాలా రోజుల తర్వాత నేను చదువుకున్న నిజాం కాలేజీకి వెళ్ళాలనిపించింది. అనుకోవడమే తరువాయి బయలుదేరాను.మధ్యలో వెళ్తూండగా ఒక కంపెనీకి చెందిన సెల్‌ఫోన్‌ అడ్వర్ట్‌టైజ్‌మెంట్‌ నన్ను బాగా ఆకర్షించింది. చూడగానే నా మదిలో ఏవేవో ఊహలు చెలరేగాయి. కానీ ఏం లాభం దాని కింద చిన్నగా ”కండిషన్స్‌ అప్లై” అని ఉంది. చాలా నిరుత్సాహం చెందాను. ఇదీ నా పరిస్థితి.

అచ్చం మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య పరిస్థితి కూడా ఇలాగే ఉందేమోననిపిస్తుంది. బంగారు తెలంగాణా కేసీఆర్‌ నాయకత్వంలో సాధిస్తామనే గంపెడాశతో కాంగ్రేస్‌ పార్టీకి రాజీనామాచేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఉపముఖ్యమంత్రి పదవినీ పొందారు. బంగారు తెలంగాణాను సాధించాలనే లక్ష్యంతో క్షేత్ర స్థాయి పర్యటనలు, దానికి తగిన హామీలను ఉపముఖ్యమంత్రి హోదాలో ఇవ్వడం ప్రారంభించారు. ఇక్కడే కేసీఆర్‌కీ, రాజయ్యకి పొరపొచ్చాలు వచ్చిఉంటాయని నా అభిప్రాయం. ప్రాంతీయ పార్టీల్లో వ్యక్తిచుట్టూ రాజకీయాలు, అధికారం తిరుగుతూ ఉంటాయి. తనను కాదని (కేసీఆర్‌) వరంగల్‌ పర్యటనలో మెడికల్‌ కాలేజీ మంజూరు విషయం సభాముఖంగా వెల్లడించడము కేసీఆర్‌కి సుతారమూ ఇష్టం లేదు. దీనితో పాటు మరికొన్ని శాఖాపరమైన నిర్ణయాలు, విధానాలను రాజయ్య స్వతంత్రంగా తీసుకుంటుంన్నారని కేసీఆర్‌కి సమాచారం అందిందని వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి. రాజయ్య కాంగ్రేస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చేముందు కేసీఆర్‌ రాజయ్యకి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఉండవచ్చు. ఇది ఒక ఆఫర్‌. అంతమాత్రాన స్వతంత్రంగా వ్యవహరించమని కాదని అర్థం. ఇది కండిషన్స్‌ అప్లై. అంటే కేసీఆర్‌ బంపర్‌ ఆఫర్‌లు ఇస్తారు కానీ, కండిషన్స్‌ అప్లై అని చిన్నగా ఉంటుంది. దానిని అర్థం చేసుకుంటూ నాయకులు మెసులుకోవాలి. ఇదీ కేసీఆర్‌ మార్కు రాజకీయం.

కేబినేట్‌లో ఎవరుండాలి, ఎవరిని తీసేయాలి అనేది ముఖ్యమంత్రి అభీష్టం మేరకు జరుగుతుంటాయి. ఎవరినైనా తీసుకోవచ్చు, ఎవరినైనా తీసేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. కానీ ఒక మంత్రిని ఎందుకు తీసేసారో తెలుసుకొనే హక్కు ప్రజస్వామ్యంలో ప్రజలకు ఉంటుంది. రాజయ్య శాఖలో అవినీతి జరిగిందని, రాజయ్యకు కూడా అందులో భాగముందని ప్రభుత్వపు వాదన. కానీ ఇప్పటివరకు ఏలాంటి అవినీతికి పాల్పడ్డాడో ప్రభుత్వం ఇప్పటివరకూ బహిర్గతం చేయలేదు. కనీసంలో కనీసం విచారణకైనా ఆదేశించలేదు. రాజయ్యను బర్తరఫ్‌ చేసే ముందు ముఖ్యమంత్రి ఒంటరిగా తన పేషీకి పిలిపించుకొని ఇవిగో నీవు చేసిన అవినీతి, దీనికి ఏం సమాధానం చెబుతావు? ఇప్పటి వరకు అడిగారా? అసలు అపాయింట్‌మెంటే ఇవ్వలేదు. వివరణ ఇచ్చేందుకు కూడా రాజయ్యను ముఖ్యమంత్రి అనుమతించలేదు. బడుగు బలహీన వర్గాలకు చెందినవాడు కాబట్టే ఏలాంటి వివరణ, సమాచారం లేకుండా తీసేసారు. అదే ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతపై ఆరోపణలు వస్తే ఏలాంటి సమాచారం లేకుండా, వివరణ తీసుకోకుండా అతడిని బర్తరఫ్‌ చేసే ధైర్యం ముఖ్యమంత్రి చేసి ఉండేవారా? అంటే అనుమానమే అని చెప్పాల్సి ఉంటుంది.

ఇప్పటికే దళితుల్లో కేసీఆర్‌పై వ్యతిరేకత అధిక శాతంలో ఉంది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాలకి చెందిన నాయకుడ్ని చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కానీ దాని తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఒక ఉపముఖ్యమంత్రే కొంత స్వతంత్రంగా వ్యవహరిస్తే తట్టుకోలేని ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బలహీన వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటే తట్టుకొని ఉండేవారా? అన్నది నా అనుమానం. రాజయ్య ఎపిసోడ్‌ తెలంగాణా సమాజానికి ఎలాంటి సందేశాన్ని పంపిస్తుంది? స్వైన్‌ఫ్లూ అనే జబ్బుని అరికట్టడంలో రాజయ్య విఫలమైనాడని ఇప్పటికే ప్రచారం చేసారు. అంటే బలహీన వర్గానికి చెందిన నాయకులు సమర్థవంతంగా పరిపాలించలేరని ముఖ్యమంత్రి అభిప్రాయమా? అనే అనుమానం కలగక మానదు. కేవలం ఒక రోగాన్నే నియంత్రించలేకపోవడం మూలాన దానికి మంత్రిని బాధ్యత చేస్తూ రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి, మరి తెలంగాణా ఏర్పడిన తర్వాత రైతులు పిట్టల్లా రాలిపోయారు. మరి దానికి వ్యవసాయ శాఖా మంత్రి పోచారంని ఎందుకు బాధ్యుడ్ని చేయలేదు ? అంతెందుకూ కరెంటు లోటు విపరీతంగా ఉంది. కొన్ని రోజుల క్రితము వరకు కేసీఆరే స్వయంగా ఆ శాఖను చూసేవారు కదా! మరి కేసీఆర్‌ కూడా విఫలమైనట్లే కదా! మరి ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలి. అంటే ఇక్కడ రాజయ్యను సమర్థించడం కాదు. ఒకవేళ అవినీతి ఋజువైతే ఎలాంటి శిక్ష వేసినా తెలంగాణ సమాజం హర్షిస్తుంది. కానీ ఎలాంటి విచారణా జరపకుండా, కనీసం రాజయ్యను వివరణ కోరకుండా బర్తరఫ్‌ చేయడం ఎంతవరకు సమంజసం?

ఇంత జరుగుతున్నా రాజయ్య మాత్రం తను ఎలాంటి తప్పు చేయలేదని ఒకవేళ విచారణకు ఆదేశిస్తే కడిగిన ముత్యంలా బయటకి వస్తానని అంటున్నారు. ఇప్పటికీ రాజయ్య కేసీఆర్‌ పై తన విధేయతను ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇలా ప్రకటించడం వలన తిరిగి తనను కేబినేట్‌లోకి తీసుకొని వేరే శాఖను అప్పగిస్తారని రాజయ్య ఆశపడి ఉండొచ్చేమో. కానీ ముఖ్యమంత్రి మనసు మాత్రం కరగడం లేదు. రాజయ్య స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఎంపీ కడియం శ్రీహరిని తీసుకున్నారు. శ్రీహరి చాలా సీనియర్‌ నాయకుడు, సమర్థత, అనుభవం ఉన్న నాయకుడు. ఎవరూ కాదనలేరు. కానీ అంతమాత్రాన కేసీఆర్‌ చేసిన తప్పు ఒప్పౌతుందా?

బంగారు తెలంగాణా అంటే ప్రజలు, మేధావులు, కళాకారులందరూ ఎంతో ఆశతో ఎదిరిచూస్తున్నారు. అందరి సలహాలూ, సూచనలు స్వీకరిస్తూ, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దేశంలోకెల్లా ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఎదుగుతుందని అందరూ ఆశపడుతున్నారు. కానీ జరుగుతున్న సంఘటనలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. ఎన్నికల ముందు కేసీఆర్‌ దళితులందరూ బాగా ఎదగాలని, ఉత్పత్తిలో వారిని కూడా భాగస్వాములను చేస్తామని,అందుకు గానూ అర్హులైనవారందరికీ భూమిని పంచుతామని ప్రకటించారు. అందుకు గానూ స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొందరికి పంచారు కూడా. ఇంతటితో అయిపోతుందా? దళితులు ఎదిగినట్లేనా? కేసీఆర్‌ కి ప్రేమ ఉన్నట్లేనా? ఒక దళిత నాయకుడు సొంత నిర్ణయాలు తీసుకుంటుంటూనే భరించలేని కేసీఆర్‌ దళితులను సామాజికంగా, ఆర్థికంగా ఎదగనిస్తాడనే నమ్మకం ప్రజలకు, సమాజానికి కలుగుతుందా?

కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రజలకు చాలా ఆశలుంటాయని, అందుకు అనుగుణంగా అవినీతి రహిత పాలనను అందిస్తానని, చివరకు తన కుటుంబ సభ్యులైనా అవినీతికి పాల్పడితే జైలుకు పంపుతానని కేసీఆర్‌ ప్రకటించారు. మంచిదే. దీనిని తెలంగాణా సభ్య సమాజం ఆహ్వానిస్తోంది. కానీ ఇది ఒక దళిత నాయకుడి నుంచే ఎందుకు ప్రారంభం చేసారు అన్నదే అందరి మెదళ్ళనూ తొలుస్తున్న ప్రశ్న. అది చిల్లర వైరస్సే అని స్వయంగా ప్రకటించిన ముఖ్యమంత్రి మరి రాజయ్యను బాధ్యుడిగా ఎందుకు చేసేనో?

Srinath Rao

He is a Journalist by profession. Alma mater of A.P.College of Journalism. Teaches Journalism. He has strong passion for politics. Aspires to be a Political Leader. He is undergoing leadership training at IIPL (Indian Institute of Political Leadership)
Srinath Rao

3 thoughts on “‘చిల్లర’ వైరస్‌ తీసిన ‘భారీ’ పదవి

  1. అర‌టిపండు ఒలిచి నో్ట్లో పెట్టినంత ఈజీగా చెప్పావ్ మ్యాన్‌… విశ్లేషణ చాలా బాగుంది…

  2. మీరు రాసిన ఆర్టికల్ చాలా బాగుంది అన్న.
    కెసిఆర్ చాలా ముందు చూపు కలవాడు . ఏంత ముందు చుపుకలవాడంటే ముక్యమంత్రి గా ప్రజలకు గాకుండా తన కుటుంబ సబ్యులకు మాత్రం చాలా న్యాయం చేసేంతగా పరిపాలన చేస్తున్నాడు …దానిలొ బాగంగానే ఉప ముక్యమంత్రిని తొలగించి ఆ స్థానములోనే ఆదే సామజిక వర్గానికి చెందినా ఎం పి కడియం శ్రీహరిని ఉప ముక్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేఇంచడం జరిగింది . ఈ ప్రమాణ స్వీకారం వెనుక ఆంతర్యం ఏమిటంటే ఎం పి లందరిలలో సీనియర్ కడియం (మిగితా వారుకూడా వున్నా వాళ్ళు కెసిఆర్ చెప్తే వింటారు) కాబట్టి కడియంకు మంత్రి పదవి కట్టబెట్టి , రాజ్యసబలో బి జె పి కి సంక్యబలం తక్కువడం వలన బి జె పి తో ఫోత్తు కుదుర్చుకొని కెసిఆర్ కుమార్తె ఎం పి కవిత కు సెంట్రల్ మినిస్టర్ పదవి ఇప్పిద్దమనే సన్నాహాలు జరుగుతున్నాయి అని నా ఆభిప్రాయం . అందులో బాగంగానే అంతకు ముందు మీడియాతో ప్రధాన మంత్రి మంత్రి పదవి ఇస్తానంటే తప్పకుంట స్వీకరిస్త అని ఎం పి కల్వకుట్ల కవిత మాట్లాడడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *