మేము లేనిదే ప్రపంచం లేదని గొప్పగా చెప్పుకునే రైతన్నలు తెలుగు రాష్ట్రాలలో అప్పుల ఊభిలో ఊగిపోతున్నారు. రెండు రాష్ట్రాలలో ఎక్కువగా సాగులో వుండే వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలకోసం రైతులు డబ్బులు అప్పుతెచ్చి పంటను సాగు చేస్తుంటారు. వర్షాభావ పరిస్థితులు, విద్యుత్‌ కోతల వలన ఆశించిన దిగుబడి రాకపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తరువాత కూడా రైతన్నల కష్టాలు ఏమాత్రం తీరటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి నాలుగు నెలల కాలంలోనే అత్యధికంగా వరంగల్‌ జిల్లాలో 52 మంది, మెదక్‌ జిల్లాలో 35, అదిలాబాద్‌ జిల్లాలో 31, నల్గోండ జిల్లాలో 28, కరీంనగర్‌ లో 27, మహబూబ్‌నగర్‌ లో 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కె.చంద్రశేఖర్‌ రావు సొంత నియోజకవర్గమైన మెదక్‌ జిల్లాలోని గజ్వేల్‌లో 18 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తంగా ఈ ఆరు నెలల కాలంలో 430 మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు.

అటు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా వెనుకబడిన ప్రాంతంగా ఉన్న రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఎక్కువ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, దళారుల చేతిలో మోసపోయిన రైతులు ఏమి చెయ్యాలో తెలియక చెట్టు కొమ్మకు ఊయ్యాలలా ఊగుతూ, పురుగుమందును అమృతం లా తాగి మరణిస్తున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనవసరంగా వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కాని రైతులను ఏ మాత్రం ఆదుకోవడం లేదు. రుణమాఫీ అని చెప్పి దానిని పూర్తిగా అమలు చేయకుండా ఈ ప్రభుత్వాలు సగం చేసి చేతులు దులుపుకుంటున్నాయి.

నేతల తలరాతలు మారుతున్నాయి గాని, రైతన్నల తలరాతలు మాత్రం మారటం లేదు. ఒక రోజు విద్యుత్‌, ఇంకొక రోజు నీళ్ళు, మరొక రోజు గిట్టుబాటుధర కోసం నిత్యం రైతన్నలు రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తింటున్నారు. రైతు దగ్గర ఉన్నంతవరకూ పంటకు రేటు ఉండదు కానీ, ప్రభుత్వం, దళారుల దగ్గరకు వెళ్ళేసరికి పంటకు రెక్కలు వచ్చేస్తున్నాయి.

తెలంగాణ ప్రాంతంలోని రైతులు ఎక్కువగా వర్షాలపై ఆధారపడి పంటలను సాగుచేస్తారు. వర్షాలు సకాలంలో కురవక పోవడంతో దిగుబడి తగ్గుతుంది. దీనిని అధిగమించడానికి బోర్లు వేసి నీళ్ళు పడేలా పంటను పండించాలనే ఆశ రైతుకు కలిగి బోర్లు వేస్తే అక్కడ నీళ్ళు పడక సాగుకోసం, బోర్లు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఆంధ్రప్రాంతంలో రైతులకు బోర్లు ఉన్నా సకాలంలో కరెంటు లేక పంటలు ఎండి పోవడం, పండిన పంటలకు మద్ధతు ధర లేకపోవడం రైతన్నలను తీవ్రంగా కలచివేస్తున్న సమస్యలు. ఈ సమస్యలను అధిగమించడానికి రైతన్నలు ఎంచుకున్న ఒకే ఒక్క దారి ఆత్మహత్య.

ప్రస్తుతం రెండు రాష్ట్రాలూ నీళ్ళు, విద్యుత్‌ కోసం సమస్యను పట్టుకొని కొట్టుకుంటున్నాయి. కాని, వాటిని పరిష్కరించి రైతులకు మేలు చేయడం లేదా. ఈ రెండు సమస్యలు తీరితే రైతన్నల ఆత్మ హత్యలు కొంత వరకూ తగ్గుతాయి.

Varaprasad Nannapaneni

He completed PG Diploma in Journalism in A P College of Journalism. He also holds a B.Tech degree.
Varaprasad Nannapaneni

2 thoughts on “రైతన్న ‘నీ’తల రాత మారేదెన్నడు..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *