అదేంటో, ఆమె జీవితంలో అన్ని అడ్డంలకులే. పుట్టడమే అనుమానంతో పుట్టిందట. అమ్మ బొజ్జలో ఏడు నెలలు చప్పుడు చేయకుండా కనీసం వారికి అనుమానం కలిగించేలా కూడా ఆమె కదలలేదంట! అమ్మ కడుపులో ఉండి డాక్టర్లతో దాగుడుమూతలు ఆడిన ఘనత నా స్నేహితురాలికే దక్కుతుందేమో. మొత్తానికి ఏడో నెలలో డాక్టర్లు దాన్ని పట్టేసుకుని ఆమె తల్లిదండ్రులకు తన గురించి చెప్పారు. ఇక అది ఈ లోకానికి రావాల్సిన సమయం వచ్చేసింది. నేను రావాలా? వద్దా? అని ఒక రాత్రంతా ఆలోచించి డాక్టర్‌లను బాగా సతాయించి దాని పుట్టినరోజున బయటకొచ్చేసింది. ఇక వచ్చిన దగ్గర నుండి అన్నీ అనుమానాలే. ప్రతీ విషయంలో వాళ్ళ అమ్మ బుర్రను తినేస్తుంటుంది. వాళ్ళ ఇంట్లో దానికి ”క్వశ్చన్‌ బ్యాంక్‌” అనీ బయటేమో ”చాటర్‌ బాక్స్‌” (chatter box) అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఇంట్లో దానకి ఇంకో పేరు కూడా వుంది ”అల్లరి” అని. జరిగిన ప్రతీ విషయం వాళ్ళ అమ్మతో చెప్పేస్తుంది. కొన్నిసార్లు అబ్బాయిలు దానికి చేసిన ప్రపోజల్స్‌ (love proposals), కామెంట్స్‌ (comments), కాంప్లిమెంట్స్‌ (compliments) కూడా అమ్మ చెవిలో వేసేస్తుంది.

వాళ్ళ అమ్మతో అది ఎంత సన్నిహితంగా ఉంటుందంటే వాళ్ళు ఓ రోజు ఓ చైనా పెళ్ళికి వెళ్ళారు. వాళ్ళ చుట్టాల అబ్బాయి ఓ చైనా అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. ఆ పెళ్ళికి వెళ్ళేముందే ఈ ”అమ్మకూచి” ఏ చైనా అబ్బాయో నచ్చితే చేసేసుకుంటాను అమ్మా అని అల్లరిగా చెప్పేసింది. ఇంత స్నేహంగా ఎవరుంటారు చెప్పండి!

ఇంకోసారి ఓ ఐస్‌క్రీం పార్లర్‌ ముందు నుంచి వెళుతూ, ”అమ్మా, నాకో ఐస్‌క్రీం ఫ్యాక్టరీ ఉన్న వాడిని చూసి పెట్టు” అని ఆటపట్టించింది. ఓసారి ఏకంగా ”వంట నేర్చుకోవే – ఫ్యూచర్‌ (future) లో ఒక రోజు కాకపోయిన ఇంకో రోజు చెయ్యాలి కదా!” అని వాళ్ళ అమ్మ అన్నపాపానికి ఓ వింత సమాధానమే ఇచ్చింది. అదేంటంటే ”ఫర్వాలేదు అమ్మా, నేను 5 స్టార్‌ హోటల్‌ చెఫ్‌ (hotel chef) ని పెళ్ళి చేసుకుంటాను” అని ఇలా దాని అల్లరికి అంతూపంతూ లేదు. ఇంత దగ్గరగా ఉండే ఆ అమ్మా-కూతురు మధ్య ఒకరికి తెలియకుండా ఒకరు ఒక విషయాన్ని దాచేసుకున్నారు.

అదీ ఫెబ్రవరీ 02, 2010, ఆ పిల్ల రాక్షస జీవితానికి ‘Black Day’ అనే చెప్పుకోవాలి. ఆ రోజు దానికి భరించలేని కడుపు నొప్పి. కాని అమ్మ మొహంలో సంతోషం. అందరు అమ్మల్ల ఆ తల్లి కూడా ”మొగ్గ పువ్వుగా మారుతుందేమో” అని అనుకుంది. కాని కాదు. ఆ పువ్వుకి ఉన్న ముళ్ళు దాన్ని పొడిచేస్తున్నాయని ఆ తల్లికి తెలియదు. వారం అయినా కడుపులో అదే నొప్పి. భరించలేనంత నొప్పి. ఆ నొప్పి వచ్చినప్పుడు ఎడమ కాలు కూడా కదల్చలేనంత నొప్పి. ఇంక ఇలా కాదని అమ్మ స్వయంగా ఆ చిట్టితల్లిని నరకంలోకి అదే హాస్పటల్‌లోకి తీసుకెళ్ళింది. వెళ్ళగానే ఏముంది ”స్కానింగ్‌” అన్నారు. అన్నట్టే స్కానింగ్‌ అయిపోయింది. ఆ రిపోర్ట్స్‌ చూసిన డాక్టరే ఆశ్చర్యపోయింది. ఏం అర్థం కాక ఇంకోసారి స్కానింగ్‌ చేయించాలన్నారు. మళ్ళీ అదే రిసల్ట్‌ అమ్మను పిలిచి ”మీ పాపకి పుట్టకతోనే గర్భసంచి లేదు” అని డాక్టర్‌ చెప్పగానే ఆ తల్లి కుప్పకూలిపోయింది. అరిచింది. డాక్టర్‌ అని కూడా లెక్క చేయకుండా తిట్టింది.

కాసేపయ్యాక ప్రశాంతంగా మళ్ళీ డాక్టర్‌తో మాట్లాడి ఇందులో ఎంతవరకూ నిజమో అడిగింది. దీనికి ఏ వైద్యం లేదా? మందుల వల్ల తెప్పించవచ్చా? ఎంతూనా తల్లి మనసుకదా! ఆఖరికి తన అమ్మతనాన్ని ఆ చిట్టితల్లికి ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. ఏ ఆపరేషన్‌ కైనా సిద్ధమని చెప్పింది. కాని ఆ పిచ్చి తల్లికి తెలియదుగా. ఇది సాధ్యంకాదనీ పెద్ద హాస్పటల్స్‌కు తిరిగింది. ఎంతోమంది డాక్టర్‌లని కలిసింది. కాని ఎక్కడా దీనికి మందులు కాని వైద్యం కాని దొరకలేదు.

ఇటు పిల్లని చూస్తే రోజు రోజుకీ నొప్పి. స్కూల్‌, చదువు, స్నేహితులూ ఉండే తన లోకంలోకి ఒక్కసారిగా హాస్పటల్స్‌, మందులూ, డాక్టర్స్‌ వచ్చేసారు. తనకు ఏమైందో తెలియని స్థితిలో ఏ మందు ఇస్తే అది, ఏ టెస్ట్‌ అంటే దానికి తలూపేసేది. అస్సలు విషయం చెప్పినా అర్థం చేసుకోలేని వయసు. కొన్ని రోజులకి శరీరం కూడా మందులకు స్పందించడం మానేసింది.

మరీ లోకం కాకులుగా కూస్తుంది. ఒకరేమో ఎవరి కర్మ వారే అనుభవించాలి అన్నారు. ఇంకొకరు తల్లిదండ్రులు చేసిన పాపమే పిల్లలకి తాకుతుంది అన్నారు. కొందరు ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఇలా తాకి అనుభవిస్తుందన్నారు.

అలా రెండేళ్ళు గడిచిపోయాక ఆమె ధైర్యం చేసి తన రిపోర్ట్స్‌ని తనే చదువుకుంది. తెలిసిన స్నేహితుల చుట్టాలలో డాక్టర్‌లను కలిసి అసలు విషయం తెలుసుకుంది. అమ్మ తనకు ఇన్ని రోజులూ ఈ విషయం చెప్పనందుకు కోపం వచ్చీ అమ్మను అడిగేద్దామనుకుంది. కాని ఆ రోజు రాత్రి తనకు తెలియకుండా వాళ్ళ అమ్మ ఏడవడం చూసింది. అలా ఏడవటం ఆ ఒక్క రోజే కాదు. ప్రతీ రాత్రులూ జరుగుతుంది. ఆమె కళ్ళలోనే సముద్రం మొత్తం ప్రవహించే అంత ఏడ్చేది. ఆమె మనసు నిండా చెప్పలేనంత బాధ. అలాంటి ఆమె, ఒక్క విషయంలో మాత్రమే హాయిగా వుంది. తన కూతురికి దీని గురించి తెలియదన్న ఒకే విషయం. అలాంటి అమ్మ మనసులో అలజడి రేపడం ఇష్టం లేక, ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చేది నా స్నేహితురాలు.

ఎవరికి చెప్పి ఏడవాలి? కనీసం అమ్మను ఓదార్చటానికి నాన్న ఉన్నారు. మరి తనకి? ”ఎవరికి చెప్పాలి?” అన్న ప్రశ్న ప్రశ్నలాగే ఉండిపోయింది.

ఎలాగోలా హోమియోపతికి మారి పోయింది. ”గుడ్డికంటే మెల్ల నయం” అన్నట్టు ఆ హోమియోపతి వల్ల కాస్త నొప్పి తగ్గింది. ఆరు నెలలకోసారి స్కానింగ్‌. ఒక్కోసారి ఓక్కో రిసల్ట్‌. ఓ సారి గర్భసంచి కాస్త కనిపిస్తుంది అని. ఇంకోసారి అసలు ఏం కనిపించటం లేదు. ముందులానే ఉందని. ఒక్కోసారి అసలు ఇది డెవలప్‌ అవడం జరగని పనీ అని కూడా వచ్చేసేది. ఇంతకంటే ఇంకో నరకం వుంటుందా?

భరించలేక ఆ రోజు వాళ్ళ అమ్మ వొడిలో పడుకుని బాధ మొత్తం కక్కేసింది. అమ్మ ఓదార్చింది. నచ్చచెప్పింది. ఎందుకంటే ”తల్లి” మనసు కదా! తన బాధ మింగేసి కూతుర్ని ఓదార్చింది.

అన్నీ ఆశలూ వదిలేసుకుని బతకడం మొదలు పెట్టింది. ఏదో అమ్మ తృప్తి కోసం మందులు వాడటం అప్పుడప్పుడూ ఆ నరకంలోకి వెళ్ళి వచ్చేది. తన కోసం అమ్మ ఎంత డబ్బు ఖర్చుచేసిందో తనకీ, అమ్మకీ మాత్రమే తెలుసు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఏ రోజూ వారితో హాస్పట్‌ వెళ్ళలేదు కదా!

వాళ్ళ అమ్మ ప్రేమ, దేవుళ్ళ వరకు వెళ్ళిపోయింది. ఎన్నో పూజలు, వ్రతాలు. ఈ తల్లి పిచ్చి ప్రేమను భరించలేక తన చీకటి ప్రపంచం నుండి బయటకు రావాలనుకుని కాస్త కష్టమయినా నవ్వడం నవ్వించడం మొదలు పెట్టింది. అమ్మ ప్రపంచాన్నే మార్చేసింది. తన ప్రపంచాన్ని పువ్వులా మార్చినా దానికున్న ముళ్ళు తనని ఎప్పుడూ గుచ్చుకుంటూనే వుంటాయి కదా! అలా ఈ రంగుల ప్రపంచంలోని అన్ని రోజులతో పాటు తన ‘Black Day’ అదే ఫిబ్రవరి 2 కి ”ఆరేళ్ళు” పూర్తిచేసుకుంది. పాపం ఎంత కష్టమొచ్చిందే నీకు!

ఇంతకీ దాని పేరు చెప్పలేదు కదా! తన పేరు ”O.అమ్మాయి”. ఆ అమ్మాయి జీవితంలోని ఈ కష్టాన్ని ఏదో ఒకరోజు దేవుడు చూసి ఆలోచిస్తాడనే చిన్న ఆశతో…

ఇంకో ”అమ్మాయి”!

Sravya Bandaru

6 thoughts on “ఆమె కడుపు కోతకు ”ఆరేళ్ళు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *