ఎన్నో ఆశలు.. ఆశయాలతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన “రిషితేశ్వరి” సహ విద్యార్థుల లైంగిక వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. అయితే రిషితేశ్వరి బలవన్మరణానికి కారణాలేంటి..?

ర్యాగింగ్ భూతమా…? కులాధిపత్య అరాచకమా..?

ఇది కచ్చితంగా కులాధిపత్య అరాచకమే….  ర్యాగింగ్ ముసుగులో జరుగుతున్న కులాధిపత్య అరాచకం.. అసలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థుల సమస్యలపై పోరాడడమే విద్యార్థి సంఘాల ప్రథమ కర్తవ్యం.. కాని ఆ విద్యార్థి సంఘాలు ఆ బాధ్యతను మర్చిపోయాయి. ఇప్పుడు అవి విద్యార్థి కుల సంఘాలుగా మారాయి.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అడుగు పెడితే చాలు..  మొదట కుల సంఘాల బోర్డులే స్వాగతం పలుకుతాయి. ఒక వైపు దేశంలోని అనేక యూనివర్సిటీలు సరికొత్త కోర్సులతో పరుగులు పెడుతుంటే.. నాగార్జున యూనివర్సిటీ మాత్రం కులం కుంపట్ల మధ్య, కులం  కుళ్లులోమగ్గిపోతుంది.

ఏ సమస్య వచ్చినా విద్యార్థులకు అండగా ఉండాల్సిన విద్యార్థి సంఘాలు ఆ సమస్యలో కుల, రాజకీయ పరమైన అంశాలు వస్తే మాత్రం వాటి భావాజాలాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి.  ఉదాహరణకి ఏపీలో అధికార పక్షానికి అనుభంధంగా ఉన్న విద్యార్థి సంఘం ఈ కేసుకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు  రోడ్డే ఎక్కలేదు. అధికార పక్షం ధోరణి ఇలా ఉన్న…. ప్రతి పక్షాలు ఏమయ్యాయి.? రాజకీయ పరమైన విషయాల్లో ఏకమైయి  అఖిలపక్షం ఏర్పాటు చేసుకునే పార్టీలు… మానవత్వం విషయాలకు వచ్చే సరికి ఏమయ్యాయి..? ఒక వేళ పోరాడిన రాజకీయ పార్టీలు ఇలాంటి ఘటనలను పట్టుకుని పాలిటిక్స్ లో మైలేజ్ కోసం పాకులాడుతున్నాయి. నిజాయితీ గా న్యాయం చేయాలని పోరాడే పార్టీలు కరువైయ్యాయి. మరో నిర్భయ ఉద్యమం వస్తే తప్ప ఈ కేసులో నిందితులకు శిక్ష పడదు.

అసలు ఏం జరిగింది..?

వరంగల్ కు చెందిన రిషితేశ్వరి ఆర్కిటెక్చర్ చదువుకోవడానికి నాగార్జన యూనివర్సటీలో చేరింది. అయితే యూనివర్సటీలో అదే కోర్సు చేస్తున్న ఫైనలియర్ కు చెందిన శ్రీనివాస్, చరణ్ లు రిషితేశ్వరిని ప్రేమించాలని వేధించేవారు.  తాము చెప్పినట్లు చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్న క్రమంలో జులై 13 న సినిమాకు వెళ్లిన రిషితేశ్వరిని సినిమా థియేటర్ లో కూడా వేధింపులకు గురి చేశారు. సినిమా మధ్యలో వచ్చినందుకు పనిష్మెంటుగా హాస్టల్ లో సీనియర్ విద్యార్థిని హనీషాతో ర్యాగింగ్  చేయించారు. ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారణ కోసం మొబైల్ లో వీడియో తీయాలని సూచించారు. ఈ వీడియో ఆధారంగా చరణ్, శ్రీనివాస్ లు రిషితేశ్వరిని బ్లాక్ మొయిల్ చేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేకే జులై 14న రిషితేశ్వరి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుందని విద్యార్థులలో బలంగా వినిసిస్తున్న వాదన.

మానవత్వం ఎక్కడ….?

మానవత్వం మంట కలిసిపోతుంది. ఒక ఆడపిల్ల మరొక ఆడపిల్లను వేధించడం సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. కనీసం ఒక్క నిమిషం రిషితేశ్వరిని వేధించే ముందు తను ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ రోజు రిషితేశ్వరి మనందరిలా చిరునవ్వులు నవ్వుతూ మన మద్యే ఉండేది. “మాయమై పోతున్నడమ్మ మనిషన్న వాడు…  మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు’’ అన్న అందెశ్రీ పాట ఈ ఘటనకు నిలువెత్తు నిదర్శనం.

విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ ను అరికట్టాల్సిన అధ్యాపకులే ర్యాగింగ్ ను ప్రొత్సహిస్తున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై నిజనిర్ధాణ కమిటీ ముందు విద్యార్థులందరు ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్ బాబురావుపై ఆరోపణలు చేస్తుండగా.. కొంతమంది ప్రిన్సిపల్ అనుకూలంగా ఉన్న విద్యార్థులు దాడికి దిగారు. ప్రిన్సిపల్ బాబురావును కాపాడే ప్రయత్నం చేశారు. తమ కులం వాడు కావడంతోనే కొంతమంది విద్యార్థులు కాపాడే ప్రయత్నం చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన అధ్యాపకులు కులం రొచ్చులో తాండవం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఈ కేసు మరుగున పడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

రిషితేశ్వరి చివరి మాటలు

నవ్వు..!నవ్వు..! నవ్వు..! ఈ నవ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడు నవ్వుతూ ఉండటమే కాదు అందరిని నవ్విస్తూ ఉంటా..కాని ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది.

మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచారునాన్న. నాకు చదువంటే చాలా ఇష్టం . ఈ చదువు(ఆర్కిటెక్చర్) కోసం నా ఊరు warangal వదిలి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను.

ఇలా వచ్చిన నన్ను నా seniors లో కొంత మంది చదువు వైపు కాకుండా ప్రేమ వైపు లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలో వెళ్లలేదు. దాంతో నా మీద rumors spread చేశారు. అవి వింటేనే నా మోహంలో నవ్వు మాయమై పోయింది. ఏడుపు కూడా వచ్చేది.

ఏ అమ్మాయి యూనివర్నటీలో ర్యాగింగ్ ఉండదు అని అనుకోవద్దు. యూనివర్సటీ అంటేనే ఒక పెద్ద నరకం లాంటిది.

అని రిషితేశ్వరి రాసిన మై లాస్ట్ నోట్ లో చెప్నిన భయంకరమైన నిజం.

ఇది మనకు తెలిసిన రిషికేశ్వరి జీవిత గాథ, కాని ఇంకా ఎన్నో కళాశాల్లో,  విశ్వవిద్యాలయాల్లో ఎంతో మంది రిషితేశ్వరిలు ర్యాగింగ్ పేరుతో నరకాన్ని అనుభవిస్తున్నారు. రిషితేశ్వరి ఘటనతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ర్యాగింగ్ పై కఠినమైన చట్టాలను తెచ్చి విశ్వవిద్యాలయాల్లో, కళాశాల్లో ర్యాగింగ్ ను  అరికట్టాలి.

– నన్నపనేని వరప్రసాద్

Varaprasad Nannapaneni

2 thoughts on “‘మై లాస్ట్ నోట్’ చెప్పిన “నిజం’’

  1. Yes this is really true Rishikeshwari story. ragging started including working places and temples all places. so take action government immediately.

Leave a Reply

Your email address will not be published.