Author: Sravya Bandaru

  • కటాక్షించేవాడు దేవుడా ? కక్షకట్టేవాడు దేవుడా ?

    “ఇచ్చి-పుచ్చుకోండి!“ ఎంత ఇస్తారో అంతకంటే రెండింతలు ఎక్కువ గెలుచుకుంటారు. ధన, కనక, వస్తు రూపంలో నాకు టైం మీద సమర్పించుకుంటే అంతకి రెండింతలు మీరు గెలుచుకుంటారు.

    ఏదో T.V లో advertisement లా ఉంది అనుకుంటున్నారా? అయితే మీరు తీర్థం లో కాలేసినట్టే. ఇదేంటే? వేస్తే పప్పు లో వెయ్యాలి కానీ విడ్డూరంగా తీర్థం లో వేయడమేంటి అని ఆలోచిస్తున్నారా? తొందరెందుకు దండగా నేను ఉన్నాగా అండగా. ఆవేశపడకండి. మీకు అర్ధమయ్యేలా నేను చెబుతాను.

    కధలోకి వెళ్ళే ముందు ఇది చెప్పండి. గోవిందా- గోవింద. గట్టిగ చెప్పండి గోవిందా- గోవింద. ముచ్చటగా మూడోసారి చెప్పండి గోవిందా- గోవింద!

    ఇప్పుడు అసలు కధలోకి వద్దాం.

    సాక్షాత్ దైవస్వరూపుడు . . . కాదు కాదు, దైవమే Give and Take Policy ని పెట్టింది. అందుకే ముందే చెప్పా, ఇచ్చి పుచ్చుకో అని. త్రిలోకాల్లో ఈ Bill అమలులో ఉంది. అమలు చేసాక బిల్ ఏంటి? ఇదిప్పుడు చట్టం. ఇదే ప్రస్తుత న్యాయం కూడా.

    నిజమేగా దేవుడు చాల costly అయ్యాడు. అన్ని ఉన్నవారికే ఇంకా ఇవ్వడం దేవుడికి అలవాటైపోయింది. చాలా డబ్బులు హుండిలో వేసి, ఏ నగలో, బంగారమో ముడుపు కట్టేసారనుకోండి. అంతే! Super fast express లా మీ కోరికలన్నీ ఇట్టే ఫలించేస్తాయి.

    “మీరు మీ జాతకం ప్రకారం ఫలానా హోమం చేసి, అభిషేకం కూడా చేసి, ఇంత బంగారాన్ని దేవుడికి సమర్పించి, మరీ అరవై రకాల ప్రసాదాలు కాకపోయినా ఏ ఆరు రకాల వంటకాలో నివేదిస్తే చాలు, మీకు పెళ్ళి జరుగుతుంది. ఉద్యోగం నడుచుకుంటూ వస్తుంది. ఇక లక్ష్మి దేవి పరిగెత్తుకుంటూ వస్తుంది.” ఇలా ఏ బాబానో ఎవరికన్నా చెబితే ఏం చేస్తారు? ఏముంది, ఉన్నావారయితే మరుసటి రోజే ఆ పూజలన్ని చేసేస్తారు. మరి లేనివారు? ‘అయ్యో, అంత డబ్బే కనుక ఉంటే ఈ కష్టాలెందుకు’ అని బతికేస్తారు.

    ఈ మధ్య ఓ పూజలో ఒక బాబా చెబుతున్నమాటలివి. ” ఇవాళ ఈ పూజకొచ్చి, ప్రసాదం తిన్నవారే అదృష్టవంతులు. పూజకొచ్చి ప్రసాదం తినకుండా వెళ్ళినా, అసలు పూజకే రాని వారు చాలా దురదృష్టవంతులు.”

    మనలో మన మాట- పూజకి హడావిడిగా వచ్చి వెళ్ళిన వారిలో ఒకరు, ఏ కోట్ల రూపాయలలో బిజినెస్ కాంట్రాక్టు కోసమో వెళ్ళిఉండవచ్చుగా. మరి అతను కోట్ల బిజినెస్ చేస్తునందుకు అదృష్టవంతుడా? లేక ప్రసాదం తీసుకోనందుకు దురద్రుష్టవంతుడా? ఇక పూజకే రానివారు అంటారా . . గుడి బయట అడుక్కునేవారిని లోపలకి రానిస్తారా? పోనీ పూజ అవ్వగానే భక్తులందరికీ ప్రసాదం పెట్టినట్టు వీరికి ప్రత్యేకంగా వెళ్ళి ఇస్తారా? ఇవ్వరు. ఇచ్చినా అది మిగిలిన ప్రసాదం అయితే పెడతారు. మరి వీలందరు దురదృష్టవంతుల list లోకి వస్తారా?

    అందరిని చల్లగా చూసే బాధ్యత దేవుడిదే అంటారుగా. మరి ఉన్నవాడు- లేనివాడు అనే భేదాలు ఎందుకు? ఆయనకి పూజలు- పునస్కారాలు చేసి Publicity చేసేవారికే అన్ని ఇస్తాడు. ఇవేం చేయ్యనివారిని అసలు పట్టించుకోడు. ఇదేం న్యాయం తండ్రి! అందరు నీ బిడ్డలే అయినప్పుడు అందరిని సమానంగా చూడాలిగా. నువ్వే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు?

    మొక్కులు తీర్చకపోతే దేవుడు శిక్షిస్తాడా? టైం కి అన్ని మొక్కులు తీర్చేస్తేనే కోరుకున్నవి ప్రసదిస్తడా? ఓహో! అంటే దేవుడు కూడా మనుషుల్లా పగ తీర్చుకుంటాడు అన్నమాట.

    నాకెప్పుడు ఓ సందేహం ఉంటుంది. సమాజంలో దొంగ బాబాలు ఎందుకు పుట్టుకొస్తారు? డబ్బుకోసమేగా? మరి దేవుడు కూడా తన ఖాతాని పెంచుకోడానికే తన భక్తులకి ఇలాంటి సెంటిమెంట్లు పెడుతాడ?

    వినండి, బాగా వినండి. మీరు చాలా సంపాదించుకొని, మీ దెగ్గర కార్లు, బంగళాలు వచ్చేసాకా దేవుడిని ప్రార్ధించండి. మీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాడు. ఎందుకంటే మీరు కూడా RICH అనే మాట మెడలో వేసుకుని తిరుగుతారుగా.

    కాని కొండలలో నెలకొన్న స్వామి- కోనేటి లోని చిన్న చిన్న జీవ రాసులని కూడా అప్పుడప్పుడు ఏ ఆషాడం offer గానో, శ్రావణం sale లోనో, మరి ఇంకే discount season లోనో కనికరిస్తూ ఉండు. నువ్వు busy ఉండే పండగ season లో కాకపోయినా, తమరి ఖాళి సమయాల్లో కాస్త అలోచించి, నీ policy లో కొన్ని మార్పులు చెయ్యాలని ప్రార్ధిస్తున్నాను.

    మనం కూడా “స్వచ్ఛమయిన మనసుతో నమ్మి, స్వేచ్చగా జీవిద్దాం”. కానీ. . . . . ఆ స్వేచ్చకి ఎంత ఖర్చవుతుందో? ఆగండి, దేవుడినే అడిగి చెబుతా!!!

  • నా తొలి ప్రేమ లేఖ

    ఇదిగో ఈ క్షణం కేవలం నీకోసం మాత్రమే ఆలోచించాలనిపిస్తుంది. తెలియని ఆనందం. అది ఈ వేళ నా తొలి ప్రేమ లేఖగా మారింది. నా తొలి ప్రేమలేఖే కాదు, నా చివరి ప్రేమ లేఖ కుడా నీకేనేమో ! ఎందుకంటే నవ్వు నన్నూ – నేను నిన్ను ప్రేమించుకునంతగా ఎవరు ఎవరిని ప్రేమించలేరేమో. ప్రేమించినా కూడా అది మన ప్రేమ అంత గొప్పది కాలేదేమో. అది గొప్పది అన్నా కూడా నేను ఊరుకోనుగా ! నీతో గొడవ పడినట్టే వాళ్ళతోనూ గొడవ పెట్టేసుకుంటా.

    అవును, అసలు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాను ? నీ బాహ్య సౌందర్యానికా ? లేక నీ మేదస్సుకా? రెండింటికినేమో ! ఎందుకంటే నేను అన్నీ నీ దగ్గర నుండే నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. మరి రెండిటినీ పొగడాలి కదా.

    అందమైన మోము, హాయినయిన చిరునవ్వు, స్వచ్ఛమైన మనసు, ఇవి చాలదా నీ గురించి చెప్పడానికి. ఇక నీ మేధస్సు ? ఆహ ! చెప్పనకర్లేదు. నా ప్రశ్నలన్నిటికి నువ్వే సమాధానం. నా కొచ్చే ఆపదలను నన్ను- నేనుగా తీర్చుకునేల చేసేది నువ్వే కదా ! నన్ను ఆనందంగా భరిస్తావు. ఆప్యాయంగా దగ్గర తీసుకుంటావు. ఇవి చాలదా నిన్ను ప్రేమించడానికి. అవును, ఇవే నా ప్రేమకి అర్హతలు. నేనే కాదు -నువ్వు కుడా నన్ను చూసిన మొదటి క్షణం నుండి నాలాగే ప్రేమిస్తునావు.నాకంటే ఎక్కువే ప్రేమిస్తునావు అనుకో.

    నాకింకా గుర్తుంది. నా ఎడుపుతోనే మన ప్రేమ మొదలైంది. నా కన్నీరే మన ప్రేమకు శ్రీకారం చుట్టింది.ఆ ఒక్క రోజే నేను ఏడ్చాను. నా ఏడుపు చూసి నువ్వు ఆనందించావు.

    నేను ఎప్పుడయినా ఎలాగైనా నీతో ఉండొచ్చు. ఏ క్షణమైనా నిన్ను విసిగించేయోచ్చు. ఎందుకంటే మన ప్రేమకి ఏ హద్దులు లేవుగా !

    నా సుఖాలనే కాదు నా కష్టాలను కుడా స్వీకరిస్తావు.రోజుకోసారి i love you లు చెప్పుకోకపోయినా మన ఇద్దరి మనసులో ఉండే మాటే అది. రోజు శికారులకి వెళ్ళము. గిఫ్టులు ఇచ్చుకోము. అలా ప్రేమిస్తేనే ప్రేమంటార? అయితే అది నా దృష్టిలో నకిలీ ప్రేమే ! అలా అనుకోవడం కూడా నేరమే. రోజు ప్రత్యేకంగా కలుసుకోము. కలుసుకోవడమేంటి? అసలు దూరంగా ఉంటేనేగా కలుసుకునేది.

    ఇదిగో ఎవ్వరు మన ప్రేమకి దిష్టి పెట్టనంటే నిన్ను నా ప్రపంచానికి పరిచయం చేసేస్తా. అది ఎవరో కాదు మా ‘ అమ్మేనని.’

    అవును ! నా ఈ ప్రేమలేఖ మా అమ్మకే. ఈ ప్రేమలేఖలోని ప్రతి మాట నిజమే. కావాలంటే మళ్లీ చదవండి.

    అమ్మ . . .

    నీకు వంద కౌగిలింతలే ఇవ్వనా? వెయ్యి పాదాభి వందనాలే చెప్పనా?
    మన ప్రేమ ఇలాగే శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుకుంటూ . .

    నీ ప్రియమయిన,

    రాక్షసి . . . !

  • నేను బద్దకించిన ఆ ఉదయం…

    ఎవరూ లేని ఎడారిలో ఒక్కదాన్నే ఉన్నట్టు అనిపించింది. కాని ఉన్నారు! చుట్టూరా అరుపులు. ‘కావు – కావు’ మంటూ ఓ పక్కన నా ఫోన్‌ అరుస్తుంది. అయినా తీయబుద్ధికాలేదు. అసలు ఏం పట్టనట్టే పడుకున్నాను. ప్రపంచం మొత్తం అప్పుడే పుట్టిన పసిపాప పాల బుగ్గలా అనిపించింది. ముట్టుకుంటే కందిపోతుందేమో అనుకుంటాంగా అలా ”నేను” మంచం దిగితే ఎక్కడ ఈ చల్లని వాతావరణం ”మిస్‌” అవుతానేమో అనిపించీ అలానే పడుకున్నాను. నాకు చాలా ఇష్టమైన చల్లటి ఐస్‌ క్రీమ్‌ లాంటి గాలి, వేడి-వేడి మిర్చీబజ్టి లాంటి దుప్పటి కప్పుకుని తెలియకుండానే పెదాలపై వచ్చిన చిరునవ్వుతో ఆ వాతావరణాన్నీ ఎంజాయ్‌ చేసిన ఘనత నాకే దక్కుతుందేమో. పిచ్చుకల అరుపులు నా కోసం పాడుతున్న బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ లా అనిపించింది. తెలియకుండానే నా గుండెలో గజ్జెల చప్పుడు నా కాళ్ళని కదిలించేశాయి. అలా పడుకునే కాళ్ళతో డ్యాన్స్‌ కూడా చేసేస్తున్నాను.

    అదీ నా రాకుమారుడి కోసం ఎదురు చూస్తూ చేసినట్టే అనిపించింది!

  • ఆమె కడుపు కోతకు ”ఆరేళ్ళు”

    అదేంటో, ఆమె జీవితంలో అన్ని అడ్డంలకులే. పుట్టడమే అనుమానంతో పుట్టిందట. అమ్మ బొజ్జలో ఏడు నెలలు చప్పుడు చేయకుండా కనీసం వారికి అనుమానం కలిగించేలా కూడా ఆమె కదలలేదంట! అమ్మ కడుపులో ఉండి డాక్టర్లతో దాగుడుమూతలు ఆడిన ఘనత నా స్నేహితురాలికే దక్కుతుందేమో. మొత్తానికి ఏడో నెలలో డాక్టర్లు దాన్ని పట్టేసుకుని ఆమె తల్లిదండ్రులకు తన గురించి చెప్పారు. ఇక అది ఈ లోకానికి రావాల్సిన సమయం వచ్చేసింది. నేను రావాలా? వద్దా? అని ఒక రాత్రంతా ఆలోచించి డాక్టర్‌లను బాగా సతాయించి దాని పుట్టినరోజున బయటకొచ్చేసింది. ఇక వచ్చిన దగ్గర నుండి అన్నీ అనుమానాలే. ప్రతీ విషయంలో వాళ్ళ అమ్మ బుర్రను తినేస్తుంటుంది. వాళ్ళ ఇంట్లో దానికి ”క్వశ్చన్‌ బ్యాంక్‌” అనీ బయటేమో ”చాటర్‌ బాక్స్‌” (chatter box) అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఇంట్లో దానకి ఇంకో పేరు కూడా వుంది ”అల్లరి” అని. జరిగిన ప్రతీ విషయం వాళ్ళ అమ్మతో చెప్పేస్తుంది. కొన్నిసార్లు అబ్బాయిలు దానికి చేసిన ప్రపోజల్స్‌ (love proposals), కామెంట్స్‌ (comments), కాంప్లిమెంట్స్‌ (compliments) కూడా అమ్మ చెవిలో వేసేస్తుంది.

    వాళ్ళ అమ్మతో అది ఎంత సన్నిహితంగా ఉంటుందంటే వాళ్ళు ఓ రోజు ఓ చైనా పెళ్ళికి వెళ్ళారు. వాళ్ళ చుట్టాల అబ్బాయి ఓ చైనా అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. ఆ పెళ్ళికి వెళ్ళేముందే ఈ ”అమ్మకూచి” ఏ చైనా అబ్బాయో నచ్చితే చేసేసుకుంటాను అమ్మా అని అల్లరిగా చెప్పేసింది. ఇంత స్నేహంగా ఎవరుంటారు చెప్పండి!

    ఇంకోసారి ఓ ఐస్‌క్రీం పార్లర్‌ ముందు నుంచి వెళుతూ, ”అమ్మా, నాకో ఐస్‌క్రీం ఫ్యాక్టరీ ఉన్న వాడిని చూసి పెట్టు” అని ఆటపట్టించింది. ఓసారి ఏకంగా ”వంట నేర్చుకోవే – ఫ్యూచర్‌ (future) లో ఒక రోజు కాకపోయిన ఇంకో రోజు చెయ్యాలి కదా!” అని వాళ్ళ అమ్మ అన్నపాపానికి ఓ వింత సమాధానమే ఇచ్చింది. అదేంటంటే ”ఫర్వాలేదు అమ్మా, నేను 5 స్టార్‌ హోటల్‌ చెఫ్‌ (hotel chef) ని పెళ్ళి చేసుకుంటాను” అని ఇలా దాని అల్లరికి అంతూపంతూ లేదు. ఇంత దగ్గరగా ఉండే ఆ అమ్మా-కూతురు మధ్య ఒకరికి తెలియకుండా ఒకరు ఒక విషయాన్ని దాచేసుకున్నారు.

    అదీ ఫెబ్రవరీ 02, 2010, ఆ పిల్ల రాక్షస జీవితానికి ‘Black Day’ అనే చెప్పుకోవాలి. ఆ రోజు దానికి భరించలేని కడుపు నొప్పి. కాని అమ్మ మొహంలో సంతోషం. అందరు అమ్మల్ల ఆ తల్లి కూడా ”మొగ్గ పువ్వుగా మారుతుందేమో” అని అనుకుంది. కాని కాదు. ఆ పువ్వుకి ఉన్న ముళ్ళు దాన్ని పొడిచేస్తున్నాయని ఆ తల్లికి తెలియదు. వారం అయినా కడుపులో అదే నొప్పి. భరించలేనంత నొప్పి. ఆ నొప్పి వచ్చినప్పుడు ఎడమ కాలు కూడా కదల్చలేనంత నొప్పి. ఇంక ఇలా కాదని అమ్మ స్వయంగా ఆ చిట్టితల్లిని నరకంలోకి అదే హాస్పటల్‌లోకి తీసుకెళ్ళింది. వెళ్ళగానే ఏముంది ”స్కానింగ్‌” అన్నారు. అన్నట్టే స్కానింగ్‌ అయిపోయింది. ఆ రిపోర్ట్స్‌ చూసిన డాక్టరే ఆశ్చర్యపోయింది. ఏం అర్థం కాక ఇంకోసారి స్కానింగ్‌ చేయించాలన్నారు. మళ్ళీ అదే రిసల్ట్‌ అమ్మను పిలిచి ”మీ పాపకి పుట్టకతోనే గర్భసంచి లేదు” అని డాక్టర్‌ చెప్పగానే ఆ తల్లి కుప్పకూలిపోయింది. అరిచింది. డాక్టర్‌ అని కూడా లెక్క చేయకుండా తిట్టింది.

    కాసేపయ్యాక ప్రశాంతంగా మళ్ళీ డాక్టర్‌తో మాట్లాడి ఇందులో ఎంతవరకూ నిజమో అడిగింది. దీనికి ఏ వైద్యం లేదా? మందుల వల్ల తెప్పించవచ్చా? ఎంతూనా తల్లి మనసుకదా! ఆఖరికి తన అమ్మతనాన్ని ఆ చిట్టితల్లికి ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. ఏ ఆపరేషన్‌ కైనా సిద్ధమని చెప్పింది. కాని ఆ పిచ్చి తల్లికి తెలియదుగా. ఇది సాధ్యంకాదనీ పెద్ద హాస్పటల్స్‌కు తిరిగింది. ఎంతోమంది డాక్టర్‌లని కలిసింది. కాని ఎక్కడా దీనికి మందులు కాని వైద్యం కాని దొరకలేదు.

    ఇటు పిల్లని చూస్తే రోజు రోజుకీ నొప్పి. స్కూల్‌, చదువు, స్నేహితులూ ఉండే తన లోకంలోకి ఒక్కసారిగా హాస్పటల్స్‌, మందులూ, డాక్టర్స్‌ వచ్చేసారు. తనకు ఏమైందో తెలియని స్థితిలో ఏ మందు ఇస్తే అది, ఏ టెస్ట్‌ అంటే దానికి తలూపేసేది. అస్సలు విషయం చెప్పినా అర్థం చేసుకోలేని వయసు. కొన్ని రోజులకి శరీరం కూడా మందులకు స్పందించడం మానేసింది.

    మరీ లోకం కాకులుగా కూస్తుంది. ఒకరేమో ఎవరి కర్మ వారే అనుభవించాలి అన్నారు. ఇంకొకరు తల్లిదండ్రులు చేసిన పాపమే పిల్లలకి తాకుతుంది అన్నారు. కొందరు ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఇలా తాకి అనుభవిస్తుందన్నారు.

    అలా రెండేళ్ళు గడిచిపోయాక ఆమె ధైర్యం చేసి తన రిపోర్ట్స్‌ని తనే చదువుకుంది. తెలిసిన స్నేహితుల చుట్టాలలో డాక్టర్‌లను కలిసి అసలు విషయం తెలుసుకుంది. అమ్మ తనకు ఇన్ని రోజులూ ఈ విషయం చెప్పనందుకు కోపం వచ్చీ అమ్మను అడిగేద్దామనుకుంది. కాని ఆ రోజు రాత్రి తనకు తెలియకుండా వాళ్ళ అమ్మ ఏడవడం చూసింది. అలా ఏడవటం ఆ ఒక్క రోజే కాదు. ప్రతీ రాత్రులూ జరుగుతుంది. ఆమె కళ్ళలోనే సముద్రం మొత్తం ప్రవహించే అంత ఏడ్చేది. ఆమె మనసు నిండా చెప్పలేనంత బాధ. అలాంటి ఆమె, ఒక్క విషయంలో మాత్రమే హాయిగా వుంది. తన కూతురికి దీని గురించి తెలియదన్న ఒకే విషయం. అలాంటి అమ్మ మనసులో అలజడి రేపడం ఇష్టం లేక, ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చేది నా స్నేహితురాలు.

    ఎవరికి చెప్పి ఏడవాలి? కనీసం అమ్మను ఓదార్చటానికి నాన్న ఉన్నారు. మరి తనకి? ”ఎవరికి చెప్పాలి?” అన్న ప్రశ్న ప్రశ్నలాగే ఉండిపోయింది.

    ఎలాగోలా హోమియోపతికి మారి పోయింది. ”గుడ్డికంటే మెల్ల నయం” అన్నట్టు ఆ హోమియోపతి వల్ల కాస్త నొప్పి తగ్గింది. ఆరు నెలలకోసారి స్కానింగ్‌. ఒక్కోసారి ఓక్కో రిసల్ట్‌. ఓ సారి గర్భసంచి కాస్త కనిపిస్తుంది అని. ఇంకోసారి అసలు ఏం కనిపించటం లేదు. ముందులానే ఉందని. ఒక్కోసారి అసలు ఇది డెవలప్‌ అవడం జరగని పనీ అని కూడా వచ్చేసేది. ఇంతకంటే ఇంకో నరకం వుంటుందా?

    భరించలేక ఆ రోజు వాళ్ళ అమ్మ వొడిలో పడుకుని బాధ మొత్తం కక్కేసింది. అమ్మ ఓదార్చింది. నచ్చచెప్పింది. ఎందుకంటే ”తల్లి” మనసు కదా! తన బాధ మింగేసి కూతుర్ని ఓదార్చింది.

    అన్నీ ఆశలూ వదిలేసుకుని బతకడం మొదలు పెట్టింది. ఏదో అమ్మ తృప్తి కోసం మందులు వాడటం అప్పుడప్పుడూ ఆ నరకంలోకి వెళ్ళి వచ్చేది. తన కోసం అమ్మ ఎంత డబ్బు ఖర్చుచేసిందో తనకీ, అమ్మకీ మాత్రమే తెలుసు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఏ రోజూ వారితో హాస్పట్‌ వెళ్ళలేదు కదా!

    వాళ్ళ అమ్మ ప్రేమ, దేవుళ్ళ వరకు వెళ్ళిపోయింది. ఎన్నో పూజలు, వ్రతాలు. ఈ తల్లి పిచ్చి ప్రేమను భరించలేక తన చీకటి ప్రపంచం నుండి బయటకు రావాలనుకుని కాస్త కష్టమయినా నవ్వడం నవ్వించడం మొదలు పెట్టింది. అమ్మ ప్రపంచాన్నే మార్చేసింది. తన ప్రపంచాన్ని పువ్వులా మార్చినా దానికున్న ముళ్ళు తనని ఎప్పుడూ గుచ్చుకుంటూనే వుంటాయి కదా! అలా ఈ రంగుల ప్రపంచంలోని అన్ని రోజులతో పాటు తన ‘Black Day’ అదే ఫిబ్రవరి 2 కి ”ఆరేళ్ళు” పూర్తిచేసుకుంది. పాపం ఎంత కష్టమొచ్చిందే నీకు!

    ఇంతకీ దాని పేరు చెప్పలేదు కదా! తన పేరు ”O.అమ్మాయి”. ఆ అమ్మాయి జీవితంలోని ఈ కష్టాన్ని ఏదో ఒకరోజు దేవుడు చూసి ఆలోచిస్తాడనే చిన్న ఆశతో…

    ఇంకో ”అమ్మాయి”!

  • కల (Dream)

    మా ఇంట్లో నాలుగు గదులున్నాయి. ఆ రోజు నేను మా అమ్మ వాళ్ళ బెడ్‌రూమ్‌లో పడుకున్నాను. హాల్లో నుంచి ఏవో చప్పుళ్ళు. అవి కాస్తా మెల్లిమెల్లిగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అది కూడా ఏవో ”గిఫ్ట్‌లు రెడీ కదా!” డెకరేషన్‌ అంతా చేసేసారుగా. కేక్‌ తెచ్చారా? ఇంక తనని లేపుదామా. అని ఏవేవో చిన్న స్వరంలో వినిపించాయి. ఇక నేను మెళ్ళిగా లేచి రూం నుంచి బయటకు వస్తున్నా… అంతే ”హ్యాపీ బర్త్‌డే” అని పెద్దగా అరచేసారు. ఆ అరిచన వారందరూ నా స్నేహితులూ, అన్నయ్యలే. కానీ అందులో ఒక్క మొహం మాత్రం నాకు తెలియదు. తన చేతిలో ఓ గులాబి. తను ఎవరూ అని చూస్తున్నాను. ఇంతలో మోగింది ‘wake up – wake up’ అంటూ అలారమ్‌. టైం చూస్తే ”ఐదు’. కల్లో కూడా పడుకొని కలలు కంటున్నాను చూడండీ….నా మీద నాకే నవ్వొచ్చింది. లేచాక మనసులో ఏదో భావం. ఆలోచిస్తే ఏం గుర్తుకురావడం లేదు. ఇక మా అమ్మ నాన్నతో ఎప్పుడో చెప్పిన మాట గుర్తొచ్చింది. తెల్లవారుఝామున వచ్చిన కలలు నిజమవుతాయని. ఆ ఒక్క మాటతో నా బర్త్‌డే కోసం ఎదురుచూపులు మొదలుపెట్టాను. నాకు తెలిసి ఈ లోకంలోని ప్రతీ మనిషి ఇలాంటి కలలతోనే బతికేస్తున్నారు. రేపో మాపో మంచి రోజులు వస్తాయన్న చిన్న ”కల’. అదే ఆశగా చిగురించి మనల్ని నడిపిస్తుంది. నా విషయానికొస్తే, ‘రేపు’ అనే మాటంటేనే కల.

    కొన్ని సార్లు చావు కలలు. కొన్నిసార్లు పీడ కలలు. ఒకసారి పెళ్ళి కల. ఇంకోసారి ”హ్రితిక్‌ రోషన్‌” కల. ఇలా వింత వింత కలలతో మన నిద్ర గడిచిపోతుంది. నిద్రలోనే కాదండోయ్‌ అమ్మా నాన్న కలలను నిజం చెయ్యాలి అనేదీ ఓ కలే! గొప్ప పేయింటర్‌ కావడం ఒక కల. ఇవి అందరి జీవితంలో జరగవు. పట్టుదలతో కృషి చేసి జరగేటట్టు చేసుకునే వారికే ఇవి సొంతం అవుతాయి.

    ఈ కలలు నిజాలు కాకపోయినా వాటితోనే జీవితం గడిపేస్తాం. అలా ఎందుకు చేస్తాం? కలల్లో కాలాన్ని వృథా చేసుకోవడం అవసరమా? అని ఒక్కోసారి మీకు మీరే ప్రశ్నించుకోండి? మీకు సమాధానం దొరకదు. దొరికినా మీరు దానితో సంతృప్తి పడరు.

    కొన్నిసార్లు అబద్ధమే తీయగా ఉంటుంది అంటాం కదా! ఇది కూడా అంతే. ”కల” ఈ చిన్న కోరిక వల్లే ప్రపంచం నడుస్తోంది. ఇది జరిగినా జరగకపోయినా అందరికి ఇష్టమైనది.

    పడుకునే ముందు మనం ఏదో దయ్యం సినిమా చూస్తాం అదేంటో మనకు తెలియకుండానే ఆ దయ్యం మన బుర్రలో తిష్టేసి కూర్చుంటుంది. ఎప్పుడెప్పుడు మనం పడుకుంటామా అని ఎదురు చూస్తుంటుంది. ఎలా అంటే దొంగోడు చీకటి కోసం ఎదిరిచూసినట్టు. మనం అలా రెప్ప మూస్తామో లేదో ఇలా మన కల్లోకి వచ్చి డైరెక్ట్‌గా ముచ్చట్లు పెట్టేస్తుంది. మీకూ ఎప్పుడో ఒకసారైనా ఇలా జరిగే ఉంటుంది కదా!

    శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం మన ఆలోచనలు, మన మనసులో రేపటి గురించి ఉన్న ఆతురత, మదిలోని భావాలే ఇలా కలల రూపంలో మనకు దర్శనమిస్తాయట! మన బుర్రంతా వాటి చుట్టూరా తిరగడం వలన ఇలా కలల రూపంలో వస్తాయంట.

    కాని మనమందరం మాత్రం చావు కల వస్తే మంచి జరగబోతోందని. పెళ్ళి కల వస్తే చెడు జరగబోతోందని మనలో మనమే అనేసుకుంటాం. కొన్నిసార్లు పీడకల. ఆ పీడకలలో దయ్యం. ఆ దయ్యాన్ని పరిగెత్తించాలన్న కుతూహలంలో కొందరు తాయత్తు మహిమలు చేయిస్తుంటారు. ఇంకొందరైతే ఏ మొక్కో గుర్తుచేయడానికి సాక్షాత్తూ దేవుడే నా కల్లోకి వచ్చాడు అని చెప్పేస్తుంటారు.

    ”అనుకున్న వారికి అనుకున్నంత వాసుదేవ’ అని ఇలాంటి వారికోసమే అంటారేమో.

    కలలు నిజమో కాదో తెలియదు కానీ వాటి వల్లనే అందరం జీవిస్తున్నాం. అందుకే కలను కలగా మిగిల్చకుండా ఆ కలలను నిజ జీవతంలో మనమందరమూ సాధించుకోవాలనేదే నా ఈ చిన్ని ”కల”!

  • ‘అమ్మాయి ఆదిపరాశక్తి’

    నిన్న మార్కెట్‌లో కూరగాయలు కొంటుంటే అలా నా చెవిలో ఓ మాట వచ్చి పడింది – ‘అబ్బా! ఆ అమ్మాయి భలే అందంగా ఉంది కదరా’ అంటూ ఒక అబ్బాయి నన్ను చూస్తూ తన పక్కన వాడితో చెబుతున్నాడు. ఆ మాటలు విన్న ఏ అమ్మాయికైన కాస్త కోపం వచ్చినా మనసులో మాత్రం గాల్లో తెలిపోతూ, ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. కోపం ఎందుకు? ఎవడో తెలియని వాడు తనగురించి మాట్లాడుతున్నందుకు కోపం వచ్చినా మనసులో కాస్త సంతోషంగానే ఉంటుందండోయ్‌! ఎంతైనా అది పొగడ్త కదా!

    కాని ఈ మాట నన్ను ఒక ఆలోచనకు గురి చేసింది. మదిలో ఓ పెద్ద యుద్ధమే అనుకోండి. అసలు ‘అందమైన’ అమ్మాయేంటి? అమ్మాయే అందం. నాకు తెలిసి దేవుడి సృష్టిలో ఓ అపూరపమైన మాయ స్త్రీ. అలాంటి ఆమెను ‘ఆడ’ (అక్కడ) ఉండాల్సిన పిల్ల అంటూ దూరం పెట్టేస్తుంటారు ఎందుకు?

    కాటుక కళ్ళు, ముక్కుపుడకతో మురిపించే ముక్కు, పెదవులపై ముసిముసి నవ్వులూ, విశాలమైన నుదురూ, అబ్బా. ఎంత చెప్పినా తక్కువే. ఆడపిల్ల అంటే భారం అంటుంటారు. అందరి భారం మోసే ఆ తల్లి భూదేవి కూడా ఆడదేగా. ఆ విషయం గుర్తేరాదు ఎవరికీ? ఎందుకలా?

    నిజానికి చెప్పాలంటే, స్త్రీ కోసమే పుట్టిన ఆభరణాలకే మాటలు వస్తే అవి ఎంత మురిసిపోయేవో? కాని ఏం లాభం? మాటలొచ్చిన ఈ ప్రపంచానికి మాత్రం స్త్రీ అంటే ఎప్పటికీ చులకనే!

    ఆమె ఆపాదమస్తకాన్నీ అలంకరించడానికి నైల్‌ పాలిష్‌లూ, గోరింటాకులూ, మెడలోకి గొలుసులూ, చేతికి గాజులూ, కాళ్ళకి పట్టీలూ, నడుముకి వడ్డానమూ, చెవులకి ఝంకాలూ, పాపిడి బిళ్ళా ఇలా ఒకటేంటి, అన్నీ ఆమె కోసమే పుట్టాయి. వీటిని బతికిస్తున్నారే కాని ఆమెను ఎక్కడైనా బ్రతకనిస్తున్నారా?

    పాపం! ఆ చిట్టి తల్లి, ఇంటికోసం ఎంత కష్టపడుతుంది. ఇంటికి పనిమనిషిలా, పిల్లలకు అమ్మలా, భర్తకు సుఖాన్నిచ్చే భార్యలా, ఒక కోడలిగా కూతురిగా ఎన్ని పాత్రలు పోషిస్తుంది. అవేవీ గుర్తుపెట్టుకోకుండా పురిటిలోనే చంపేస్తున్నారెందుకు?

    నాకు ఎప్పుడూ ఓ అనుమానం ఉంటుంది. అదేంటంటే భర్త కోసం దేవుడి దగ్గర కాంట్రాక్ట్‌ తీసుకుని ఎన్నో స్కీములపేరుతో ఉపవాసాలు ఉంటుంది. అదేనండి! నోములూ వ్రతాలని ఎన్నో చేస్తుంటారుగా మరి ఈ స్కీములన్నీ ఆడవారికే ఎందుకు? మగవారికి వర్తించవా?

    అమ్మగారింటి నుండి అత్తగారింటికి పంపిచేటప్పుడు ఇక ‘నీ భర్తే నీకు దేవుడు’ అని చెప్పడమే వింటాం కానీ అబ్బాయికీ ఏ ఒక్కరైనా ‘నీ భార్య నీకు దేవతతో సమానం. ఆమెను మంచిగా చూసుకొ’ అనే ఓ చిన్న మాటకూడా అతడి చెవున పడేయరెందుకు?

    ఇంత బంగారు తల్లిని అమ్మ బొజ్జలో ఉన్నప్పుడే చంపేస్తుంటారు ఎందుకు? కానీ… అలా చంపేయడమే ఓ కందుకు మంచిదేమో! ఎందుకనుకుంటుంన్నారా పెరుగుతున్న ఆమె వయసు మీద కన్నేసి ఆమెను మరీ కౄరంగా అత్యాచారం చేసి చంపేస్తున్నారు. ఇంత హింస పెట్టి చంపే బదులు అమ్మ నన్ను నీ కడుపులోనే ‘చంపేసి-బతికించు’ అని ఆ చిన్నారి తల్లి ఏడ్చేస్థాయికి వచ్చేలా ఉందీ లోకం.

    ‘అన్నయ్యా! అని పిలిచిన ఆమెకు రక్షణ ఇవ్వటం మాని ఆ అన్నే తనపై అఘాయిత్యం చేస్తున్న రోజులివి. చదువు చెప్పే మాస్టారే చప్పుడు చేయకుండా విద్యార్థిని చంపేస్తున్న కాలమిది. ఇలా వాడు-వీడు అనే తేడానే లేదు. ప్రతీ ఒక్కరికీ ‘స్త్రీ’ శరీరం మీదే కన్ను.

    కానీ ఒక్క మాట మాత్రం నిజం – ఆమె ఓపికను పరీక్షిస్తున్న ఈ లోకాన్ని అంతు చూడటానికి ఎప్పటికైనా ఆది-పరాశక్తి రానే వస్తుంది. ఆ రోజు పండు వెన్నెలలో నిప్పుల వర్షం కురవడం మాత్రం తధ్యం.

  • సోషల్‌ నెట్‌వర్క్స్‌

    ఏవండోయ్‌, ఇక నటించింది చాల్లేండి! లేవండి షాపింగ్‌కి టైమ్‌ అయ్యింది. నేనా? నటిస్తున్నానా? నిజంగా నిద్రపోతుంటే ఏంటే నీ గోడవ! అబ్బో, మీరు అబద్ధం చెబుతారేమో కాని మీ వాట్సాప్‌ (whatsapp) లోని లాస్ట్‌ సీన్‌ మాత్రం అబద్ధం చెప్పదండోయ్‌! అనే స్థాయికి సోష్‌ల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు వచ్చేసాయంటే నమ్ముతారా!

    ఇక పిల్లల విషయానికొస్తే స్కూలు-కాలేజీల్లో ఇచ్చిన హోం వర్కులు చేస్తున్నారో లేదో తెలియదు కాని అన్ని సోషల్‌ నెట్‌వర్కులలో స్టేటస్‌లు (status), ఫోటోలు అప్‌డేట్‌ చేయడం మాత్రం మర్చిపోవట్లేదు. ఇంక అసలు ఏ పనీ -పాట లేని వారి గురించి చెప్పనక్కర్లేదు. పొద్దున లేచి కాక హోటల్‌లో తాగిన ‘ టీ ‘ దగ్గర నుంచి రాత్రి పడే ‘డోస్‌’ వరుకు అందరికి తెలియజేయడానికి ఈ సోషల్‌ నెట్‌వర్కులను బీభత్సంగా వాడేస్తుంటారు. అలా అన్ని మంచి-చెడూ తేడా లేకుండా అన్ని వీటి ద్వారా చెప్పేస్తుటారు.

    ‘మా బామ్మ చనిపోయింది’ అని ఒక్క స్టేటస్‌ పెట్టి ఆమె ఫోటోకి దండేయకుండా నైనా సరే ఒక్కసారి ఫేస్‌ బుక్‌లో అప్‌డేట్‌ చేస్తే చాలు, ఓ వంద లైక్‌లు యాబై RIPలు అదేనండి Rest-in-Peace  కమెంట్ల రూపంలో ఎగిరొచ్చి పడిపోతాయి. ఇలా ఒకటి కాదు – రెండు కాదు జీవితంలోని ప్రతీ నిమిషం గురించి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లలో పెట్టేస్తుంటారు. ఇప్పుడు కాలంలో ఓ మనిషి గురించి తెలుసుకోవాలంటే వాడి ఫేస్‌ ని చూడనక్కర్లేదు. వాడి ఫేస్‌ బుక్కుని బ్రౌజ్‌ చేసేస్తేచాలు.

    ఈ మధ్య కాలంలో మనిషి దేవుడ్ని దర్శిస్తున్నాడో లేదో కాని మన గూగుల్‌ తల్లిని దర్మించడం మాత్రం మరవట్లేదు. ఈ సోషల్‌ నెట్‌వర్కులలో ప్రాముఖ్యతను గాంచిన దేవుళ్ళు చాలానే ఉన్నాయండోయ్‌. ఫేస్‌ బుక్‌ దేవుడు, ట్విటర్‌ దేవత, యూట్యూబ్‌, గూడుల్‌+, యాహు అని చాలా రకాల భగవంతులను ఇంటర్‌నెట్‌ లో ఆన్‌లైన్‌ దర్శనం చేసుకోవచ్చు.

    మన ప్రభుత్వం జనాభలెక్కల కోసం ఫేస్‌బుక్కుని పరిశీలిస్తే చాలు ఇట్టే అందరి వివరాలు తెలిసిపోయే పరిస్థితిలో ప్రపంచం ఉంది.

    ఒక నెలలో యూట్యాబ్‌కు ఒక బిలియన్‌ ప్రేక్షకులు వస్తారంటే నమ్ముతారా! ఏ టీ.వి చానల్‌కు కూడా ఇంత మంది ప్రేక్షకులు లేరు. మరి నేనేం తక్కువ తిన్నానా అంటూ ఫేస్‌బుక్‌ కూడా పది మిలియన్‌ యాప్స్‌తో అందరిని ఆకర్షిస్తుంది. ఒక్క గూగుల్‌+ లోనే అక్షరాల మూడువందల నలభైౖ మూడు మిలియన్‌ల వినియోగదారులున్నారంటే నమ్ముతారా!

    మరి వీటిని ఇంతగా ఎందుకు వినియోగిస్తున్నారో తెలుసా! ప్రతీ మనిషికి తప జీవితం కంటే ఎదుటి వారి జీవితం మీదే ఆశ ఎక్కువ. ఈ ఒక్క కారణంతో సోషల్‌ నెట్‌వర్కులు ప్రపంచాన్నే ఏలేస్తున్నాయి. మనిషికి తన జీవితంలో ఇవీ ఒక భాగమైపోయాయి.

    మనిషికి నడకలు నేర్పిస్తున్నాయి. మనిషని నడిపిస్తున్నవి కూడా ఇవే! ఒక మనసుని – ఇంకో మనసుతో కలుపుతున్నవీ ఇవే ! పలానా కష్టం వచ్చిందని ఒక మాటలో స్టేటస్‌ (status) పెడితే చాలు వంద చేతులు మన కోసం వచ్చేస్తాయి. ఇంత బిజీ ప్రపంచంలో మనుషులను కలుపుతున్నది ఈ సోషల్‌ నెట్‌వర్కులే. దూరాన్ని కూడా దగ్గరగా చేసేస్తున్నాయి.

    అసలు మాట్లాడటానికి ఇష్ట పడని వాటి గురించి కూడా ఇక్కడ చర్చలు జరిగిపోతుంటాయి. ఒక విషయం గురించి ఒక్క ట్వీట్‌ చేస్తే చాలు లిప్త పాటు సమయంలో ఇది అందరికి చేరిపోతుంది. కొన్ని క్షణాల్లోనే మిగిలిన వారి రిప్లయ్‌లు (reply) రెస్పాన్స్ (response) లు వచ్చేస్తుంటాయి. ఎక్కడా వీలుకాని స్పందన – ప్రతిస్పందన ఇక్కడే సాధ్యమవడమే దీని ప్రత్యేకత.

    ఈవెంట్స్‌కు ఇన్విటేషన్లు, బిజినెస్‌కు సంబంధించిన ఏవైన సరే ఇక్కడ మనకు కనిపిస్తాయి. గేమ్స్‌, యాప్స్‌, లైక్స్‌, కమెంట్స్‌, గ్రూప్‌లు ఏది కాదు- ప్రతీది ఇక్కడ ఉంటాయి.

    ఇంకోందరైతే రెంట్‌ కట్టే పనిలేకుండానే సోషల్‌ నెట్‌వర్కుల్లో షాపులు తెరచేసి నగలని, చీరలని, పిల్లలకు సంబంధించినవి బొమ్మలని-బట్టలని ఒకటి కాదు రెండు కాదు ప్రతీది అమ్మేస్తుంన్నారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు కూడా మనతో ఇక్కడే కొనిపించేస్తున్నారు. ఇలా షేరింగ్‌ అండ్‌ లర్నింగ్‌  ఇక్కడే సాధ్యమని చెప్పాలంటే

    లక్ష్మీ దేవి సరస్వతీదేవి ఇద్దరూ ఈ సోషల్‌ నెట్‌వర్కుల ద్వారానే మన ఇంటికీ వచ్చేస్తారు !