Category: Telugu

  • నేను బద్దకించిన ఆ ఉదయం…

    ఎవరూ లేని ఎడారిలో ఒక్కదాన్నే ఉన్నట్టు అనిపించింది. కాని ఉన్నారు! చుట్టూరా అరుపులు. ‘కావు – కావు’ మంటూ ఓ పక్కన నా ఫోన్‌ అరుస్తుంది. అయినా తీయబుద్ధికాలేదు. అసలు ఏం పట్టనట్టే పడుకున్నాను. ప్రపంచం మొత్తం అప్పుడే పుట్టిన పసిపాప పాల బుగ్గలా అనిపించింది. ముట్టుకుంటే కందిపోతుందేమో అనుకుంటాంగా అలా ”నేను” మంచం దిగితే ఎక్కడ ఈ చల్లని వాతావరణం ”మిస్‌” అవుతానేమో అనిపించీ అలానే పడుకున్నాను. నాకు చాలా ఇష్టమైన చల్లటి ఐస్‌ క్రీమ్‌ లాంటి గాలి, వేడి-వేడి మిర్చీబజ్టి లాంటి దుప్పటి కప్పుకుని తెలియకుండానే పెదాలపై వచ్చిన చిరునవ్వుతో ఆ వాతావరణాన్నీ ఎంజాయ్‌ చేసిన ఘనత నాకే దక్కుతుందేమో. పిచ్చుకల అరుపులు నా కోసం పాడుతున్న బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ లా అనిపించింది. తెలియకుండానే నా గుండెలో గజ్జెల చప్పుడు నా కాళ్ళని కదిలించేశాయి. అలా పడుకునే కాళ్ళతో డ్యాన్స్‌ కూడా చేసేస్తున్నాను.

    అదీ నా రాకుమారుడి కోసం ఎదురు చూస్తూ చేసినట్టే అనిపించింది!

  • పగవాడికి కూడా ఈ జీవితం వద్దు!

    నా పేరు ఒరేయ్‌, అందరూ నన్ను ఇలాగే పిలుస్తుంటారు. ఒరేయ్‌ ఏంటీ గమ్మత్తుగా వుందే నీ పేరు వినగానే నవ్వువచ్చేటట్లు! ఇంతకూ ఈ పేరు పెట్టింది ఎవరూ అనేగా మీ ప్రశ్న. నిజానికి దీన్ని పేరు అని అంటారో లేదో కూడా నాకు తెలియదు. మీ అందరికీ నవ్వు తెప్పించే నా పేరు, నాకు మాత్రం ఇలా ఎవరైనా పిలిస్తే బాధగా వుంటుంది. ఎందుకంటే నాకు అమ్మ నాన్న, బామ్మ అందరూ ఉన్నారు కాని వీరిలో ఏ ఒక్కరూ నాకు పేరు పెట్టలేదు. బామ్మ ముసలిది అప్పటి కాలం మనిషి ఏ పేరు పెట్టాలో తోచలేదు. ఇక అమ్మ నేను కడుపులో ఉన్నప్పటి నుండి కూడా పిచ్చిదానిలా తన లోకంలో తను ఉంటుంది. ఈ విషయం నాకు బామ్మ చెప్పింది లెండీ! ఇక నాన్న నా పుట్టుకకు కారణం ఓ మగాడు అని తెలుసు కాని అతను ఎవరో మా అమ్మకే తెలియదు ఇక నాకు ఎలా తెలుస్తుంది. (ఒక వేళ అమ్మకి నాన్న ఎవరో తెలిసినా చెప్పే పరిస్థితిలో లేదు.

    ఊహ తెలిసినప్పటి నుంచి బామ్మని అడుగుతూనే ఉన్నా నాన్న ఎవరు? అమ్మ ఎందుకు ఇలా అయ్యిందో చెప్పు అని. సమయం వచ్చినప్పుడు చెబుతా అంటూ మాట దాటేసేది. ఈ విషయంలోనే చాలా సార్లు తనతో గొడవ పడి భోజనం చెయ్యకుండా మారాం చేసేవాడిని కానీ కాసేపటికే బామ్మ ఓదార్పుతో అన్నీ మర్చిపోయేవాడిని. నేను చదువుకోలేదు అమ్మకి అలా ఉండడంతో బామ్మ ఇంటి దగ్గరే వుంటూ పూలు అల్లి అమ్ముతుంది షాప్స్‌కి వేస్తుంది. దండాలు కడుతుంది. అప్పట్లో బామ్మ ఏడోతరగతి వరకూ చదివిదంట. ఆవిడే అక్షరాలు నేర్పింది కొద్దికొద్దిగా రాయగలను కూడా!

    నేను మా ఊర్లో జరిగే అన్ని పెళ్ళిళ్ళలో భోజన సమయంలో సప్లయ్‌ చేయడం వంటివి చేస్తాను ప్రతీ పెళ్ళికీ 50 రూపాయలు ఇస్తారు. అందరూ నన్ను ఒరేయ్‌ అని పిలుస్తుంటారు. బామ్మ కొంత చదువుకుంది కదా ఏదైనాపేరు పెట్టి ఉండచ్చు కదా అని చాలా సార్లు అనుకున్నాను. అస్సలు బామ్మ చిన్నప్పుడే నేను ఏదో అల్లరి చేస్తే రెండు అంటిచ్చి ఒరేయ్‌ అని అంది. అప్పటి నుండి నా పేరు ఒరేయ్‌ అని అంది. అప్పటి నుండి నా పేరు ఒరేయ్‌ అయిపోయింది. కనీసం నాకు పేరు పెట్టే వాళ్ళు కూడా లేరే అన్నది నా బాధ. కాళీ సమయంలో మా ఇంటి ముందే ఉన్న సత్తయ్య బాబాయ్‌ దగ్గర చుట్టలు చుడతాను నెలకు 1000 రూపాయలు నా జీతం. బాబాయ్‌ ఇస్తారు నేను బామ్మకి ఇచ్చేవాడిని నన్నూ, అమ్మనూ చూస్తుంది తనేగా.

    ఉన్నదాంట్లోనే బామ్మ, అమ్మతో సంతోషంగా ఉండేవాడిని. కానీ రోజూ ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని చూస్తే వాళ్ళతో ఆడుకోవాలి అనిపించేది. కాని వాళ్ళు దగ్గరికి రానిచ్చేవారు కాదు. స్కూల్‌కి వెళ్తూ అమ్మా, నాన్నని కౌగిలించుకుని ప్రేమగా ముదుద్లఉ పెట్టించుకొని టాటా అంటూ వెళ్తుంటే నాతో అమ్మా, నాన్న ఇలా ప్రేమగా వుంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. అమ్మ చేతి గోరుముద్దలు తినలేదు ఈ ఆశ ఎప్పటికి తీరుతుందో. అమ్మతో నేను మాట్లాడటమే గాని తను ఏ రోజూ ప్రేమగా పిలిచింది లేదు. చిన్నప్పుడు ఆకలేసి ఏడ్చిన ప్రతీసారి అమ్మ అంటే బామ్మ పరుగెడుతూ వచ్చేది. నేను బయటికి వెళ్ళితే నన్ను చులకనగా చూస్తూ హేళన చేసేవారు ఎక్కువగా ఉన్నారు. ఎవరికి పుట్టావో తెలీదు, అమ్మ పిచ్చిది, బామ్మ ముసలిది, నువ్వు పనికిరానివాడివి అన్న ప్రతీసారి ఆ మాట నా గుండెల్లో కన్ని లక్షసార్లు కొట్టుకుంది. ఆ నొప్పిని భరించలేకపోయేవాడిని. ఒంటరిగా కూర్చోని ఎన్నోసార్లు వెక్కివెక్కి ఏడ్చానో! నా ఏడుపు నాకు మాత్రమే వినబడేది. మీ నాన్న పేరేమిటి? ఉన్నాడా, చచ్చడా? అసలు ఎవరు? అంటూంటే రాయి ఇచ్చి కొట్టాలనిపించేది. కొన్నిసార్లు ఆ ప్రయత్నం కూడా చేసాను బామ్మ రెండు అంటించి వెనక్కి తీసుకొచ్చేది.

    దేవుడంటే కూడా నమ్మకం లేదు అందుకే ఆయనని ఏమని కోరుకోవాలో కూడా తెలీదు. నేను పెద్దవాడిని అయ్యానంటూ బామ్మ మూడు నెలలగా వంట చేయడం కూడా నేర్పింది. నాకు ఇప్పుడు 12 ఏళ్ళు ఎప్పుడు ఏం పాపం చేసానో తెలీదు గానీ ఈ రోజు నా జీవితం అంటే విరక్తి కలుగుతుంది. నేను బతికి ఏం ప్రయోజనం? రోజూ పొద్దున్న లేస్తూనే బామ్మా అని పిలవగానే ఇక్కడే ఉన్నాను అంటూ బదులు వచ్చేది. కానీ, ఈ రోజు ఆ బదులు లేదు. బామ్మ ఎక్కడ ఉందా అంటూ వెతుకుతూ పెరట్లోకి వెళ్ళాను. అక్కడ బామ్మ పడుకుందో, పడిపోయిందో అర్థం కాలేదు. బామ్మా అంటూ పిలిచాను బామ్మ నన్ను దగ్గరికి తీసుకొని నుదిటిపై ముద్దు పెట్టి అమ్మ జాగ్రత్త అంటూ ఓ పేపర్‌ని నా చేతిలో పెట్టి చనిపోయింది. అది చూడగానే భయంతో బామ్మా అంటూ గట్టిగా అరచి స్పృహ తప్పి పడిపోయాను. లేచి చూసే సరికి సత్తయ్య బాబాయి రా అంటూ తీసుకెళ్ళి బామ్మ అంత్యక్రియలు చేయించారు.

    అమ్మని చూద్దాం అంటూ ఇంటికి వెళ్ళాను అమ్మ ఆకలి, బామ్మ అంటూ ఏడుస్తుంది. బామ్మ గురించి అమ్మకి చెప్పినా అర్థం కాదు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. బామ్మ బయటికి వెళ్ళింది కాసేపట్లో వచ్చేస్తుంది తిను అమ్మా అంటూ తినిపించాను. బలవంతం గానే కొద్దిగా తినింది. కాసేపు ఆగి కాళ్ళూ, చేతులూ కొడుతూ అరుస్తూ ఉంది. నేను అలాగే చూసాను. బామ్మ ఇచ్చిన పేపర్‌ గుర్తువచ్చింది. చదివాను. ”క్షమంచు మనవడా!” అంటూ మొదలు అయింది. ”నా పేరు యశోదమ్మ. ఎప్పుడూ నన్ను బామ్మ అనే పిలిచేవాడివి నా పేరు కూడా తెలీదుగా అందుకే చెబుతున్న. నా కొడుకులు ఆస్తి లాక్కోని బయటికి గెంటేసారు. మనం ఉంటున్న ఇల్లు మా అమ్మవాళ్ళ ఇల్లు. మీ అమ్మ నా కూతురు కాదు! 14 యేళ్ళ కిందట ఈ ఊరు వచ్చేటప్పుడు మన ఊరి చివర చెరువు దగ్గర ఆత్మహత్య చేసుకోబోతుంటే ఆపి జరిగింది తెలుసుకున్నాను. మీ నాన్న పేరు జగదీష్‌ మీ అ్మని ప్రేమించి మోసం చేసాడు. మూడు నెలల గర్భవతిగా ఉన్న మీ అమ్మను నాతో పాటే తీసుకొచ్చాను. నువ్వు పుట్టాక, సాక్షంగా నిన్ను తీసుకొని మీ నాన్నదగ్గరికి వెళదాం అనుకున్నాం. కానీ మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు ఐదవ నెలలో కింద పడింది. అప్పుడు తలకి దెబ్బ తగిలి అలా పిచ్చిదానిలా అయింది. హాస్పటల్‌ లో చూపించినా అమ్మకి నయంకాదు అన్నారు. ఇదీ నీ గతం అమ్మ జాగ్రత్త!” అంటూ ముగించింది.

    అయ్యో బామ్మ నువ్వు లేని జీవితం కష్టం అనుకుంటే, నువ్వు మాకు ఏమీ కావు అన్న నిజం నరకంలా వుంది. మా సొంత బామ్మ కాకపోయినా మా అమ్మకు సొంత అమ్మవు కాకపోయినా బిడ్డలా కాపాడావు ఇన్ని రోజులూ. చిలిపిగా నేను చేసిన అల్లరి నిన్ను బాధపెట్టి ఉంటాయి. చాలా మూర్ఖంగా చేసాను. అమ్మ ఈ సరిస్థితిలో నాన్న గురించి ఏం చెప్పలేదు. నువ్వు చెప్పలేదు. ఇక నాన్న గురించి తెలీదు అనుకున్నాను. అందుకే అమ్మకి విషం పెట్టి నేను ఆ విషం తాగాను అంటూ బోరున ఏడ్చి. అమ్మా! అంటూ అమ్మ దగ్గరికి వెళితే అమ్మ ఒరేయ్‌ అని పిలిచింది. ఎప్పుడు పిలుస్తుందా అని ఇన్ని రోజులూ ఆశగా చూస్తే అమ్మ ఇప్పటికి పిలిచింది. సంతోష పడాలో, బాధపడాలో అర్థం కాలేదు. అమ్మ ఒడిలో పడుకున్నాను. అమ్మలో కదలిక లేదు చనిపోయింది. నా గుండె ఆగిపోయింది.

    ఇది కథకాదు నిజం. లోకం మీ నాన్న ఎవరూ అంటూ వేసిన నిందలకి భరించలేక బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు ఒరేయ్‌. ఇలాంటివి మన చుట్టూ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇందులో 13 యేళ్ళ ఒరేయ్‌ తప్పు ఏముంది? అలాంటి వారిని మాటలతో హింసించకండి వీలైతే జీవితం అంటే ఏంటో నేర్పండి, బతకడానికి ఆధారం చూపండి.

  • రైతన్న ‘నీ’తల రాత మారేదెన్నడు..?

    మేము లేనిదే ప్రపంచం లేదని గొప్పగా చెప్పుకునే రైతన్నలు తెలుగు రాష్ట్రాలలో అప్పుల ఊభిలో ఊగిపోతున్నారు. రెండు రాష్ట్రాలలో ఎక్కువగా సాగులో వుండే వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలకోసం రైతులు డబ్బులు అప్పుతెచ్చి పంటను సాగు చేస్తుంటారు. వర్షాభావ పరిస్థితులు, విద్యుత్‌ కోతల వలన ఆశించిన దిగుబడి రాకపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తరువాత కూడా రైతన్నల కష్టాలు ఏమాత్రం తీరటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి నాలుగు నెలల కాలంలోనే అత్యధికంగా వరంగల్‌ జిల్లాలో 52 మంది, మెదక్‌ జిల్లాలో 35, అదిలాబాద్‌ జిల్లాలో 31, నల్గోండ జిల్లాలో 28, కరీంనగర్‌ లో 27, మహబూబ్‌నగర్‌ లో 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

    తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కె.చంద్రశేఖర్‌ రావు సొంత నియోజకవర్గమైన మెదక్‌ జిల్లాలోని గజ్వేల్‌లో 18 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తంగా ఈ ఆరు నెలల కాలంలో 430 మంది రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు.

    అటు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా వెనుకబడిన ప్రాంతంగా ఉన్న రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఎక్కువ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, దళారుల చేతిలో మోసపోయిన రైతులు ఏమి చెయ్యాలో తెలియక చెట్టు కొమ్మకు ఊయ్యాలలా ఊగుతూ, పురుగుమందును అమృతం లా తాగి మరణిస్తున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనవసరంగా వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కాని రైతులను ఏ మాత్రం ఆదుకోవడం లేదు. రుణమాఫీ అని చెప్పి దానిని పూర్తిగా అమలు చేయకుండా ఈ ప్రభుత్వాలు సగం చేసి చేతులు దులుపుకుంటున్నాయి.

    నేతల తలరాతలు మారుతున్నాయి గాని, రైతన్నల తలరాతలు మాత్రం మారటం లేదు. ఒక రోజు విద్యుత్‌, ఇంకొక రోజు నీళ్ళు, మరొక రోజు గిట్టుబాటుధర కోసం నిత్యం రైతన్నలు రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తింటున్నారు. రైతు దగ్గర ఉన్నంతవరకూ పంటకు రేటు ఉండదు కానీ, ప్రభుత్వం, దళారుల దగ్గరకు వెళ్ళేసరికి పంటకు రెక్కలు వచ్చేస్తున్నాయి.

    తెలంగాణ ప్రాంతంలోని రైతులు ఎక్కువగా వర్షాలపై ఆధారపడి పంటలను సాగుచేస్తారు. వర్షాలు సకాలంలో కురవక పోవడంతో దిగుబడి తగ్గుతుంది. దీనిని అధిగమించడానికి బోర్లు వేసి నీళ్ళు పడేలా పంటను పండించాలనే ఆశ రైతుకు కలిగి బోర్లు వేస్తే అక్కడ నీళ్ళు పడక సాగుకోసం, బోర్లు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

    ఆంధ్రప్రాంతంలో రైతులకు బోర్లు ఉన్నా సకాలంలో కరెంటు లేక పంటలు ఎండి పోవడం, పండిన పంటలకు మద్ధతు ధర లేకపోవడం రైతన్నలను తీవ్రంగా కలచివేస్తున్న సమస్యలు. ఈ సమస్యలను అధిగమించడానికి రైతన్నలు ఎంచుకున్న ఒకే ఒక్క దారి ఆత్మహత్య.

    ప్రస్తుతం రెండు రాష్ట్రాలూ నీళ్ళు, విద్యుత్‌ కోసం సమస్యను పట్టుకొని కొట్టుకుంటున్నాయి. కాని, వాటిని పరిష్కరించి రైతులకు మేలు చేయడం లేదా. ఈ రెండు సమస్యలు తీరితే రైతన్నల ఆత్మ హత్యలు కొంత వరకూ తగ్గుతాయి.

  • నిరీక్షణ

    ఉషోదయం అవుతుంటే

    కలలోని నీ రూపం కనుమరుగవుతుందనే అని

    సంధ్యా సమయం కోసం మనసు వేచి చూస్తుంది

    తిరిగి నీ దర్శనం పొందాలని

    కల కోసం నిద్రిస్తున్నా…

    కలలోని నీ కోసం నిద్రిస్తున్నా…

    కలలోని నీ రూపాన్ని కంటి పాపలో దాచుకున్నా

    కనులు తెరిచినా కనుమరుగవ్వకుండా గుండెల్లో నింపుకున్నా

    అదేంటో! చిత్రంగా ఉషోదయంలో ఉషస్సులో

    సాయంసంధ్యలో చిరుగాలిలో నీ స్పర్శ

    కాలి అందెల సవ్వడి వింటే కలలోని నీ నవ్వుల

    గల గల జ్ఞాపకం

    అరే…! నవ్వినపుడు కనీసం విరబూసిన

    పువ్వులనైనా దాచుకుందామంటే దొరకవే

    ఆకాశంలో వెండి మబ్బులై తిరిగి ఆ నవ్వుల

    పువ్వులు విరబూస్తున్నాయి

    నాలో నిద్రించే ”కళ” ను సైతం కవిత రూపంలో

    మేల్కొల్పిన కలల రాణి నిజ జీవితంలో

    ఒక్క క్షణమైనా నీ రూపాన్ని చూడాలని నిరీక్షిస్తూ………

  • మారాల్సింది డైరెక్టర్లా? అప్‌డేట్‌ కావాల్సింది తెలుగు సినిమా ప్రేక్షకులా?

    ప్రస్తుత కాలం ఏ సినిమా హిట్‌ అవుతుందో తెలియదు అలాగే ఏ సినిమా ఫట్‌ (ఫ్లాప్‌) అవుతుందో తెలియదు చివరికి. కొన్ని సినిమాలు మాత్రం అందరూ అనుకున్న విధంగానే సినిమాలు మార్కెట్‌లోకి వచ్చి విజయాలు సాధిస్తున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ఫట్‌ అంటున్నాయి.

    ఇటీవలే కొంతమంది డైరెక్టర్లు ప్రయోగం చెయ్యబోయి చేతులు కాల్చుకున్నారు. కాని ఈ డైరెక్టర్లకూ, సినిమాలోని పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఎంతో గొప్పపేరు వచ్చాయి ఈ సినిమాల ద్వారా.

    ప్రస్తుత కాలంలో తెగులో భారీబడ్జెట్‌తో వచ్చిన సినిమాల్లో మహేష్‌, సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ‘ఒన్‌: నేనొక్కడినే’ కు సుమారు 70 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేదు తెలుగలో. కాని, ‘ఒన్‌’ సినిమా అమెరికా, ఇతర దేశాలలో భారీ కలెక్షన్లు సాధించింది. దీనికి కారణం మహేష్‌బాబు కావచ్చు. కానీ, ఈ సినిమాను సుకుమార్‌ హాలీవుడ్‌ తరహాలో చిత్రీకరించారు.

    నిజానికి ఈ సినిమా ఇంట ఓడి రచ్చ గెలిచింది. తెలుగు ప్రేక్షకుల సినిమా రుచి డిఫరెంట్‌గా ఉంటుందేమోనని అనిపించింది.

    ఆ! అవును మన సినిమాలనూ బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తే ఎక్కు శాతం హిట్‌ అవుతున్నాయి. కాని, బాలీవుడ్‌లోని విజయం సాధించిన సినిమాలను టాలీవుడ్‌ లో రీమేక్‌ చేస్తే అవి ఫ్లాప్‌ అవుతున్నాయి.

    ఇటీవే విడుదల అయిన ‘ఐ’ సినిమా శంకర్‌, విక్రమ్‌ కలయికలో వచ్చిన సినిమా హిట్‌, ఫ్లాప్‌ టాక్‌తో భారీ కలెక్షన్లు సాధిస్తుంది. కొంతమంది ప్రేక్షకులు సినిమాను ఫ్లాప్‌ అంటారు, మరికొంత మంది పండితులు ఈ సినమా అద్భుతం అంటారు. ఇలా ఒక్కొక్క ప్రేక్షకుడు సినిమాల గురించి కామెంట్‌ చేస్తుంటే, నాకు నా చెతి ఐదు వేళ్ళూ గుర్తుకు వస్తాయి. ఎందుకంటే? మన చెయ్యికి ఉన్న అన్ని వేళ్ళూ విభిన్నంగా ఉంటాయి. కాబట్టి సినిమా ప్రేక్షకులు కూడా ఇలాంటి కోవకు చెందినవారే అనిపించింది.

    నిజానికి తెలుగో వచ్చిన ‘ఒన్‌’ సినిమా అద్భుతం అయ్యింది. ఈ సినమా తెలుగో విజయం సాధిస్తే తెలుగు ఇండస్ట్రి ఇట్లాంటి ప్రయోగాత్మక సినిమాలను తీసి వుండేవారు. కాని సినిమా ప్రేక్షకులు అంత గొప్ప పనికి శ్రీకారం చుట్టలేరు! ప్రస్తుత కాలంలో సినిమాలు ఘన విజయం సాధించాలి అంటే ఎక్కువ శాతం తెలుగు ప్రేక్షకులకు హాస్యం తప్పనిసరిగా కావాలి. హాస్యం లేని సినిమాలు కూడా విజయం సాధిస్యాయి కాని అలాంటివి అతి తక్కువ సినిమాలు మాత్రమే విజయం సాధించాయి.

  • కాలమా కాసేపు ఆగలేవా?

    ”చిన్నా, స్వీటీ! లెవ్వండిరా! స్కూల్‌కి టైం అవుతుంది!” అని అమ్మ నిద్ర లేపుతుంది. అప్పుడే పుట్టిన పాపాయి ఫలానా టైంకి పాప పుట్టింది అని డాక్టర్‌ కన్‌ఫర్మ్‌ చేసినప్పుడు, ఆ టైం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అనేంతలా ఉంటుంది ఆ క్షణం. సమయం మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. గోడ మీద ఉన్న గడియారం పాడైతే పక్కన పెడతాం కానీ, తెలియకుండానే ఆ గోడవైపు చూస్తాం. చేతికి రోజూ వాచ్‌ పెట్టుకొని ఒక రోజు పెట్టుకోకపోతే పెట్టుకున్న రోజైనా అన్నిసార్లు చూస్తామో లేదో గానీ పెట్టుకోని రోజు మాత్రం చాలా సార్లు చూస్తాం.

    మనకి ఇష్టమైన వారిని కలవాలనుకున్నప్పుడు చెప్పిన సమయం కంటే ఓ పది నిమిషాలు ముందే వెళ్ళిపోతాం. వారితో గడిపిన ఆ కాసేపు, సమయం తెలియకుండానే తొందరగా వెళుతున్నట్లు అనిపిస్తుంది. ఆ నిమిషం అలా ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రిందట కలుసుకున్న స్నేహితులు మళ్ళీ కలవబోతున్నారనుకోండి అందులో ఒక్కరిని కదలించి చూడండి వాళ్ళు వెంటనే మా ఫ్రెండ్స్‌ని కలిసి 3 సంవత్సరాల 4 గంటల 20 నిమిషాలు అని సెకెండ్‌ కూడా వొదిలిపెట్టకుండా చెబుతారు. మళ్ళీ కలిసే సమయం ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదరుచూస్తూ ఉంటారు.

    శుభ కార్యాలకి సమయ ప్రాధాన్యత పెరుగుతుంది, మంచి ముహూర్తం మంచి సమయం కోసం చూస్తారు.

    పిల్లల పరీక్షలు రాసేటపుడు పరీక్ష వ్యవధిని తెలుపుతుంది ఈ సమయం.

    ఇద్దరు స్నేహితులు కలిసి ఓ జాబ్‌ ఇంటర్వ్యూకి వెళ్ళినపుడు ఒకరు ఎంపికయ్యి మరొకరు అవ్వకపోతే నీ టైం బాగుందిరా, నీ టైం నడుస్తుంది కానీవూ… నాకూ టైం వస్తుంది అప్పుడు చెబుతా అంటాడు. అనుకోకుండానే పాపం సమయాన్ని తిడతారు. ”దానికే గనక నోరు ఉంటే నేనేం చేసాను నన్నంటున్నారు” అని అడిగేదేమో. మన దగ్గర ఉన్న వాచ్‌ ఆగిపోయినా కాలం ఆగదుగా! నిద్రపోయేటప్పుడు అమ్మ పాడే జోల పాటలతో ఎంత హాయిగా పడుకుంటామో అలాగే పొద్దున్నే లేవడానికి అలారం శబ్దంతో రోజు మొదలవుతుంది.

    అసలు సమయానికి ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తామోనని ఎప్పుడైనా ఆలోచించామా? నిజానికి అంత ఆలోచించాల్సింది ఏమీలేదు. మనతో ఎవరు ఉన్నా లేకపోయినా సమయం మాత్రం (కాలం) నేను ఆగను అంటూ మన వెంటే నీడలా ఉంటుంది. ఈరోజు నుంచి కాలాన్ని మీ మంచి స్నేహితునిగా చూస్తారు గా!

    అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది.వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. అవకాశం మళ్ళీ రాదు మిస్‌ చేసుకోవద్దు అని అంటారు. మిస్‌ అయిపోతే ఆ బాధ నుంచి కోలుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. చూసారా నీ సంతోషంలోనే కాదు నీ బాధలోనూ తోడుగా ఉంటాను అంటోంది సమయం. మిమ్మల్ని బాధపెట్టి కాలం కూడా మీ బాధని చూసి ఓర్చుకోలేకపోయింది కాబోలు! మరోసారి అవకాశం ఇచ్చి మీకు సక్సెస్‌ ఇచ్చింది. అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అనుకున్న వారి ఆలోచనలో ఓ ఆశ కూడా ఉంటుంది. నా సమయం ఎప్పుడూ ఇలాగే ఉంటుందా లేదులే నాకు మంచి రోజులు వస్తాయి అని ఈ ఆశే మన వెంట ఉండి నడిపిస్తుంది కాలం. సమాధానమూ ఇస్తుంది, సహాయమూ చేస్తుంది.

    కానీ సమయంతో పాటు ప్రణాళిక ముఖ్యమే. ఈ సమయం లోపు ఈ పనిని పూర్తి చెయ్యాలి అనుకుంటే దానికి పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌ ఉండాలి. కానీ కొన్ని సార్లు ఇది తప్పడం వల్లే వైఫల్యాలు వస్తాయి. మరోసారి ఈ తప్పు జరగకుండా చూసుకోండి.

  • నేను కాదా సెలీబ్రిటీ ని?

    సెలబ్రటీస్‌కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. వీళ్ళు ఏ చిన్న పని చేసినా పెద్ద రేంజ్‌లో పేరు వచ్చేస్తుంది. ఫ్లాప్‌ ఓపెనింగ్స్‌ చేయించడం, వీళ్ళనే అంబాసిడర్స్‌గా పెట్టుకొని వ్యాపారులు తమ మార్కెట్‌ని పెంచుకోవటం వంటివి చూస్తూనే ఉన్నారు. సెలబ్రెటీస్‌ అంటే ఎవరు?

    • కళా రంగానికి సంబంధించిన వారు
    • రాజకీయ నాయకులు
    • స్పోర్ట్స్‌ పర్సన్స్‌

    గుడిలో దేవుడి దర్శనానికైనా శ్రద్ధతో వెళతారో లేదో కానీ ఫలానా సెలబ్రెటీ ఏ షాప్‌ ఓపెనింగ్‌కో, ఏ సభకో స్పెషల్‌ గెస్ట్‌గా వస్తున్నారు అని తెలిస్తే మాత్రం జనాలు ఎంతో ఆసక్తిగా వెళతారు. వీళ్ళ లైఫ్‌స్టైల్‌ ఎంతో ”రిచ్‌”గా వుంటుంది. ఖాళీ దొరికినపుడు ఏ న్యూస్‌పేపర్‌కో, టి.వి. ఛానల్స్‌కో ఇంటర్వ్యూలు ఇస్తూ, వాళ్ళ కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ, పెంచుకున్న పెంపుడు జంతువులతో గడపడానికి ఇష్టపడతారు. మొన్న జరిగిన హుద్‌ హుద్‌ ప్రమాదానికి సెలబ్రెటీస్‌ అందరినీ ఒకే దగ్గరికి చేర్చి ”నేను సైతం” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అది అక్కడి ప్రజలకి ఆర్థికంగా ఉపయోగపడింది. సెలబ్రెటీస్‌ కోసం ప్రాణ త్యాగం చేసే అభిమానులున్నారు. ఎలాగంటే తమ అభిమాన హీరో మూవీ ఫస్ట్‌ షో చూడాలని టిక్కెట్ల కోసం లైన్లో నిల్చోని తొక్కిసలాటలో ప్రాణం విడిచేవారు, రాజకీయ నాయకుల కోసం మా అన్న అధికారంలోకి రావాలి, లేదంటే ఆత్మహత్య చేసుకుంటాం అని బెదిరించి అన్నంత పనీ చేసిన వారున్నారు. ఓ క్రికెటర్‌ సిక్స్‌ కొడితే చప్పట్లు కొట్టే ఈ జనమే డక్‌అవుట్‌ అయితే అప్‌సెట్‌ అవుతారు. పొద్దున్నే లేస్తూ, రాత్రి పడుకునే వరకు ఉన్న నేమ్‌నీ, ఫేమ్‌ని ఎలా కాపాడుకోవాలో అని ఆలోచించే స్థితి ఇప్పటి సెలబ్రెటీస్‌ది.

    ఇలాంటి సెలబ్రెటీస్‌ని ఆదర్శంగా తీసుకొని లైఫ్‌ అంటే వీళ్ళదే అనుకొని మనలాంటివాళ్ళు అయితే యాక్టర్‌ లేదంటే లీడర్‌ అదీ కాకుంటే స్పోర్ట్స్‌పర్సన్‌ అవ్వాలని ఆశపడి ఉన్న ఊరినీ, తల్లిదండ్రులనీ వదిలేసి వెళ్తుంటారు. మనలో ప్యాషన్‌ ఉంటే ఆ వృత్తిలోకి దిగడం వేరు, వాళ్ళ లైఫ్‌ రిచ్‌గా ఉంటుందని ఊహించుకొని రావాలి అనుకుంటే మాత్రం ఫెయిల్‌ అవ్వడం ఖాయం. సెలబ్రెటీస్‌ కోసం ప్రాణం పోగుట్టుకున్న వారికి ఏంచేయ్యగలరు సానుభూతి తెలపడం మినహా. లేదా ఆర్థికంగా కొంత సొమ్ము ఇచ్చి ఊరుకుంటారు. దీనివలన ఎవరికి లాభం ప్రాణం అయితే తిరిగి రాదుగా. ఎంత డబ్బు పెడితే మాత్రం ప్రాణం తిరిగి వస్తుంది. సెలబ్రెటీస్‌ ఏది చేసిన పేపర్లోనూ, టీ.వీ.ఛానల్స్‌లో పెద్ద పెద్ద అక్షరాలలో చూపించి చెప్పిందే చెపుతుంటారు.

    వాళ్ళు మాత్రమే సెలబ్రెటీసా ఓ కామన్‌మేన్‌ మాత్రం సెలబ్రెటీస్‌ కాదా? ఈ అనుమానం మీకు ఎప్పుడూ కలగలేదా? దేవుడు ఇచ్చిన వరంలో మనిషి పుట్టుక ఒకటి ఏ జంతువు లాగో పుట్టించకుండా మనుషులలాగా పుట్టించాడంటే ఆ జన్మకి ఒక పరమార్థం ఉంటుంది. అందుకే ఓ కామెన్‌మేన్‌ కూడా సెలబ్రెటీయే. టాలెంట్‌ని నమ్ముకొని పైకి వచ్చే ప్రతీ ఒక్కరిలోనూ సెలబ్రెటీ ఉంటాడు. మానవ సంబంధాలకి ఉన్న విలువలని గుర్తించి వాటి విలువలని కాపాడుకుంటూ, ఆపదలో ఉన్న సాటి మనిషికి మానవత్వం రూపంలో ముందుకు వచ్చి సహాయం చేసిన ప్రతివాడూ సెలబ్రెటీయే.

    సెలబ్రెటీస్‌పై అభిమానం పెంచకొని వాళ్ళపై ఏదైనా రూమర్స్‌ వస్తే నానా హంగామా చేస్తారు. మరికొంత మంది ఇవన్నీ పట్టించుకోకుండా ఇంతకన్నా ఆసక్తికరమైన విషయం లేదన్నట్లు చదువుతూ, ఎంజాయ్‌ చేస్తారు. ఎదుటి వారి లైఫ్‌ని చూసో, ఓ సెలబ్రిటీని చూసో నా జీవితం ఎందుకు అలా లేదు అని అనుకోకండి. మనకి తెలిసింది చేద్దాం అందులోనే కష్టపడదాం. దిబెస్ట్‌ అనిపించుకుందాం.

    డబ్బు కోసమో, పేరు కోసమో, పనికోసమో సెలబ్రెటీ అనిపించుకోకుండా మంచి మనస్సు, మంచి ఆలోచన ఉన్న ప్రతీ ఒక్కరిలో ఓ సెలబ్రెటీని చూసుకుందాం వాళ్ళే కామన్‌మేన్‌.

  • ఆమె కడుపు కోతకు ”ఆరేళ్ళు”

    అదేంటో, ఆమె జీవితంలో అన్ని అడ్డంలకులే. పుట్టడమే అనుమానంతో పుట్టిందట. అమ్మ బొజ్జలో ఏడు నెలలు చప్పుడు చేయకుండా కనీసం వారికి అనుమానం కలిగించేలా కూడా ఆమె కదలలేదంట! అమ్మ కడుపులో ఉండి డాక్టర్లతో దాగుడుమూతలు ఆడిన ఘనత నా స్నేహితురాలికే దక్కుతుందేమో. మొత్తానికి ఏడో నెలలో డాక్టర్లు దాన్ని పట్టేసుకుని ఆమె తల్లిదండ్రులకు తన గురించి చెప్పారు. ఇక అది ఈ లోకానికి రావాల్సిన సమయం వచ్చేసింది. నేను రావాలా? వద్దా? అని ఒక రాత్రంతా ఆలోచించి డాక్టర్‌లను బాగా సతాయించి దాని పుట్టినరోజున బయటకొచ్చేసింది. ఇక వచ్చిన దగ్గర నుండి అన్నీ అనుమానాలే. ప్రతీ విషయంలో వాళ్ళ అమ్మ బుర్రను తినేస్తుంటుంది. వాళ్ళ ఇంట్లో దానికి ”క్వశ్చన్‌ బ్యాంక్‌” అనీ బయటేమో ”చాటర్‌ బాక్స్‌” (chatter box) అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఇంట్లో దానకి ఇంకో పేరు కూడా వుంది ”అల్లరి” అని. జరిగిన ప్రతీ విషయం వాళ్ళ అమ్మతో చెప్పేస్తుంది. కొన్నిసార్లు అబ్బాయిలు దానికి చేసిన ప్రపోజల్స్‌ (love proposals), కామెంట్స్‌ (comments), కాంప్లిమెంట్స్‌ (compliments) కూడా అమ్మ చెవిలో వేసేస్తుంది.

    వాళ్ళ అమ్మతో అది ఎంత సన్నిహితంగా ఉంటుందంటే వాళ్ళు ఓ రోజు ఓ చైనా పెళ్ళికి వెళ్ళారు. వాళ్ళ చుట్టాల అబ్బాయి ఓ చైనా అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. ఆ పెళ్ళికి వెళ్ళేముందే ఈ ”అమ్మకూచి” ఏ చైనా అబ్బాయో నచ్చితే చేసేసుకుంటాను అమ్మా అని అల్లరిగా చెప్పేసింది. ఇంత స్నేహంగా ఎవరుంటారు చెప్పండి!

    ఇంకోసారి ఓ ఐస్‌క్రీం పార్లర్‌ ముందు నుంచి వెళుతూ, ”అమ్మా, నాకో ఐస్‌క్రీం ఫ్యాక్టరీ ఉన్న వాడిని చూసి పెట్టు” అని ఆటపట్టించింది. ఓసారి ఏకంగా ”వంట నేర్చుకోవే – ఫ్యూచర్‌ (future) లో ఒక రోజు కాకపోయిన ఇంకో రోజు చెయ్యాలి కదా!” అని వాళ్ళ అమ్మ అన్నపాపానికి ఓ వింత సమాధానమే ఇచ్చింది. అదేంటంటే ”ఫర్వాలేదు అమ్మా, నేను 5 స్టార్‌ హోటల్‌ చెఫ్‌ (hotel chef) ని పెళ్ళి చేసుకుంటాను” అని ఇలా దాని అల్లరికి అంతూపంతూ లేదు. ఇంత దగ్గరగా ఉండే ఆ అమ్మా-కూతురు మధ్య ఒకరికి తెలియకుండా ఒకరు ఒక విషయాన్ని దాచేసుకున్నారు.

    అదీ ఫెబ్రవరీ 02, 2010, ఆ పిల్ల రాక్షస జీవితానికి ‘Black Day’ అనే చెప్పుకోవాలి. ఆ రోజు దానికి భరించలేని కడుపు నొప్పి. కాని అమ్మ మొహంలో సంతోషం. అందరు అమ్మల్ల ఆ తల్లి కూడా ”మొగ్గ పువ్వుగా మారుతుందేమో” అని అనుకుంది. కాని కాదు. ఆ పువ్వుకి ఉన్న ముళ్ళు దాన్ని పొడిచేస్తున్నాయని ఆ తల్లికి తెలియదు. వారం అయినా కడుపులో అదే నొప్పి. భరించలేనంత నొప్పి. ఆ నొప్పి వచ్చినప్పుడు ఎడమ కాలు కూడా కదల్చలేనంత నొప్పి. ఇంక ఇలా కాదని అమ్మ స్వయంగా ఆ చిట్టితల్లిని నరకంలోకి అదే హాస్పటల్‌లోకి తీసుకెళ్ళింది. వెళ్ళగానే ఏముంది ”స్కానింగ్‌” అన్నారు. అన్నట్టే స్కానింగ్‌ అయిపోయింది. ఆ రిపోర్ట్స్‌ చూసిన డాక్టరే ఆశ్చర్యపోయింది. ఏం అర్థం కాక ఇంకోసారి స్కానింగ్‌ చేయించాలన్నారు. మళ్ళీ అదే రిసల్ట్‌ అమ్మను పిలిచి ”మీ పాపకి పుట్టకతోనే గర్భసంచి లేదు” అని డాక్టర్‌ చెప్పగానే ఆ తల్లి కుప్పకూలిపోయింది. అరిచింది. డాక్టర్‌ అని కూడా లెక్క చేయకుండా తిట్టింది.

    కాసేపయ్యాక ప్రశాంతంగా మళ్ళీ డాక్టర్‌తో మాట్లాడి ఇందులో ఎంతవరకూ నిజమో అడిగింది. దీనికి ఏ వైద్యం లేదా? మందుల వల్ల తెప్పించవచ్చా? ఎంతూనా తల్లి మనసుకదా! ఆఖరికి తన అమ్మతనాన్ని ఆ చిట్టితల్లికి ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. ఏ ఆపరేషన్‌ కైనా సిద్ధమని చెప్పింది. కాని ఆ పిచ్చి తల్లికి తెలియదుగా. ఇది సాధ్యంకాదనీ పెద్ద హాస్పటల్స్‌కు తిరిగింది. ఎంతోమంది డాక్టర్‌లని కలిసింది. కాని ఎక్కడా దీనికి మందులు కాని వైద్యం కాని దొరకలేదు.

    ఇటు పిల్లని చూస్తే రోజు రోజుకీ నొప్పి. స్కూల్‌, చదువు, స్నేహితులూ ఉండే తన లోకంలోకి ఒక్కసారిగా హాస్పటల్స్‌, మందులూ, డాక్టర్స్‌ వచ్చేసారు. తనకు ఏమైందో తెలియని స్థితిలో ఏ మందు ఇస్తే అది, ఏ టెస్ట్‌ అంటే దానికి తలూపేసేది. అస్సలు విషయం చెప్పినా అర్థం చేసుకోలేని వయసు. కొన్ని రోజులకి శరీరం కూడా మందులకు స్పందించడం మానేసింది.

    మరీ లోకం కాకులుగా కూస్తుంది. ఒకరేమో ఎవరి కర్మ వారే అనుభవించాలి అన్నారు. ఇంకొకరు తల్లిదండ్రులు చేసిన పాపమే పిల్లలకి తాకుతుంది అన్నారు. కొందరు ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఇలా తాకి అనుభవిస్తుందన్నారు.

    అలా రెండేళ్ళు గడిచిపోయాక ఆమె ధైర్యం చేసి తన రిపోర్ట్స్‌ని తనే చదువుకుంది. తెలిసిన స్నేహితుల చుట్టాలలో డాక్టర్‌లను కలిసి అసలు విషయం తెలుసుకుంది. అమ్మ తనకు ఇన్ని రోజులూ ఈ విషయం చెప్పనందుకు కోపం వచ్చీ అమ్మను అడిగేద్దామనుకుంది. కాని ఆ రోజు రాత్రి తనకు తెలియకుండా వాళ్ళ అమ్మ ఏడవడం చూసింది. అలా ఏడవటం ఆ ఒక్క రోజే కాదు. ప్రతీ రాత్రులూ జరుగుతుంది. ఆమె కళ్ళలోనే సముద్రం మొత్తం ప్రవహించే అంత ఏడ్చేది. ఆమె మనసు నిండా చెప్పలేనంత బాధ. అలాంటి ఆమె, ఒక్క విషయంలో మాత్రమే హాయిగా వుంది. తన కూతురికి దీని గురించి తెలియదన్న ఒకే విషయం. అలాంటి అమ్మ మనసులో అలజడి రేపడం ఇష్టం లేక, ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చేది నా స్నేహితురాలు.

    ఎవరికి చెప్పి ఏడవాలి? కనీసం అమ్మను ఓదార్చటానికి నాన్న ఉన్నారు. మరి తనకి? ”ఎవరికి చెప్పాలి?” అన్న ప్రశ్న ప్రశ్నలాగే ఉండిపోయింది.

    ఎలాగోలా హోమియోపతికి మారి పోయింది. ”గుడ్డికంటే మెల్ల నయం” అన్నట్టు ఆ హోమియోపతి వల్ల కాస్త నొప్పి తగ్గింది. ఆరు నెలలకోసారి స్కానింగ్‌. ఒక్కోసారి ఓక్కో రిసల్ట్‌. ఓ సారి గర్భసంచి కాస్త కనిపిస్తుంది అని. ఇంకోసారి అసలు ఏం కనిపించటం లేదు. ముందులానే ఉందని. ఒక్కోసారి అసలు ఇది డెవలప్‌ అవడం జరగని పనీ అని కూడా వచ్చేసేది. ఇంతకంటే ఇంకో నరకం వుంటుందా?

    భరించలేక ఆ రోజు వాళ్ళ అమ్మ వొడిలో పడుకుని బాధ మొత్తం కక్కేసింది. అమ్మ ఓదార్చింది. నచ్చచెప్పింది. ఎందుకంటే ”తల్లి” మనసు కదా! తన బాధ మింగేసి కూతుర్ని ఓదార్చింది.

    అన్నీ ఆశలూ వదిలేసుకుని బతకడం మొదలు పెట్టింది. ఏదో అమ్మ తృప్తి కోసం మందులు వాడటం అప్పుడప్పుడూ ఆ నరకంలోకి వెళ్ళి వచ్చేది. తన కోసం అమ్మ ఎంత డబ్బు ఖర్చుచేసిందో తనకీ, అమ్మకీ మాత్రమే తెలుసు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఏ రోజూ వారితో హాస్పట్‌ వెళ్ళలేదు కదా!

    వాళ్ళ అమ్మ ప్రేమ, దేవుళ్ళ వరకు వెళ్ళిపోయింది. ఎన్నో పూజలు, వ్రతాలు. ఈ తల్లి పిచ్చి ప్రేమను భరించలేక తన చీకటి ప్రపంచం నుండి బయటకు రావాలనుకుని కాస్త కష్టమయినా నవ్వడం నవ్వించడం మొదలు పెట్టింది. అమ్మ ప్రపంచాన్నే మార్చేసింది. తన ప్రపంచాన్ని పువ్వులా మార్చినా దానికున్న ముళ్ళు తనని ఎప్పుడూ గుచ్చుకుంటూనే వుంటాయి కదా! అలా ఈ రంగుల ప్రపంచంలోని అన్ని రోజులతో పాటు తన ‘Black Day’ అదే ఫిబ్రవరి 2 కి ”ఆరేళ్ళు” పూర్తిచేసుకుంది. పాపం ఎంత కష్టమొచ్చిందే నీకు!

    ఇంతకీ దాని పేరు చెప్పలేదు కదా! తన పేరు ”O.అమ్మాయి”. ఆ అమ్మాయి జీవితంలోని ఈ కష్టాన్ని ఏదో ఒకరోజు దేవుడు చూసి ఆలోచిస్తాడనే చిన్న ఆశతో…

    ఇంకో ”అమ్మాయి”!

  • కల (Dream)

    మా ఇంట్లో నాలుగు గదులున్నాయి. ఆ రోజు నేను మా అమ్మ వాళ్ళ బెడ్‌రూమ్‌లో పడుకున్నాను. హాల్లో నుంచి ఏవో చప్పుళ్ళు. అవి కాస్తా మెల్లిమెల్లిగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అది కూడా ఏవో ”గిఫ్ట్‌లు రెడీ కదా!” డెకరేషన్‌ అంతా చేసేసారుగా. కేక్‌ తెచ్చారా? ఇంక తనని లేపుదామా. అని ఏవేవో చిన్న స్వరంలో వినిపించాయి. ఇక నేను మెళ్ళిగా లేచి రూం నుంచి బయటకు వస్తున్నా… అంతే ”హ్యాపీ బర్త్‌డే” అని పెద్దగా అరచేసారు. ఆ అరిచన వారందరూ నా స్నేహితులూ, అన్నయ్యలే. కానీ అందులో ఒక్క మొహం మాత్రం నాకు తెలియదు. తన చేతిలో ఓ గులాబి. తను ఎవరూ అని చూస్తున్నాను. ఇంతలో మోగింది ‘wake up – wake up’ అంటూ అలారమ్‌. టైం చూస్తే ”ఐదు’. కల్లో కూడా పడుకొని కలలు కంటున్నాను చూడండీ….నా మీద నాకే నవ్వొచ్చింది. లేచాక మనసులో ఏదో భావం. ఆలోచిస్తే ఏం గుర్తుకురావడం లేదు. ఇక మా అమ్మ నాన్నతో ఎప్పుడో చెప్పిన మాట గుర్తొచ్చింది. తెల్లవారుఝామున వచ్చిన కలలు నిజమవుతాయని. ఆ ఒక్క మాటతో నా బర్త్‌డే కోసం ఎదురుచూపులు మొదలుపెట్టాను. నాకు తెలిసి ఈ లోకంలోని ప్రతీ మనిషి ఇలాంటి కలలతోనే బతికేస్తున్నారు. రేపో మాపో మంచి రోజులు వస్తాయన్న చిన్న ”కల’. అదే ఆశగా చిగురించి మనల్ని నడిపిస్తుంది. నా విషయానికొస్తే, ‘రేపు’ అనే మాటంటేనే కల.

    కొన్ని సార్లు చావు కలలు. కొన్నిసార్లు పీడ కలలు. ఒకసారి పెళ్ళి కల. ఇంకోసారి ”హ్రితిక్‌ రోషన్‌” కల. ఇలా వింత వింత కలలతో మన నిద్ర గడిచిపోతుంది. నిద్రలోనే కాదండోయ్‌ అమ్మా నాన్న కలలను నిజం చెయ్యాలి అనేదీ ఓ కలే! గొప్ప పేయింటర్‌ కావడం ఒక కల. ఇవి అందరి జీవితంలో జరగవు. పట్టుదలతో కృషి చేసి జరగేటట్టు చేసుకునే వారికే ఇవి సొంతం అవుతాయి.

    ఈ కలలు నిజాలు కాకపోయినా వాటితోనే జీవితం గడిపేస్తాం. అలా ఎందుకు చేస్తాం? కలల్లో కాలాన్ని వృథా చేసుకోవడం అవసరమా? అని ఒక్కోసారి మీకు మీరే ప్రశ్నించుకోండి? మీకు సమాధానం దొరకదు. దొరికినా మీరు దానితో సంతృప్తి పడరు.

    కొన్నిసార్లు అబద్ధమే తీయగా ఉంటుంది అంటాం కదా! ఇది కూడా అంతే. ”కల” ఈ చిన్న కోరిక వల్లే ప్రపంచం నడుస్తోంది. ఇది జరిగినా జరగకపోయినా అందరికి ఇష్టమైనది.

    పడుకునే ముందు మనం ఏదో దయ్యం సినిమా చూస్తాం అదేంటో మనకు తెలియకుండానే ఆ దయ్యం మన బుర్రలో తిష్టేసి కూర్చుంటుంది. ఎప్పుడెప్పుడు మనం పడుకుంటామా అని ఎదురు చూస్తుంటుంది. ఎలా అంటే దొంగోడు చీకటి కోసం ఎదిరిచూసినట్టు. మనం అలా రెప్ప మూస్తామో లేదో ఇలా మన కల్లోకి వచ్చి డైరెక్ట్‌గా ముచ్చట్లు పెట్టేస్తుంది. మీకూ ఎప్పుడో ఒకసారైనా ఇలా జరిగే ఉంటుంది కదా!

    శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం మన ఆలోచనలు, మన మనసులో రేపటి గురించి ఉన్న ఆతురత, మదిలోని భావాలే ఇలా కలల రూపంలో మనకు దర్శనమిస్తాయట! మన బుర్రంతా వాటి చుట్టూరా తిరగడం వలన ఇలా కలల రూపంలో వస్తాయంట.

    కాని మనమందరం మాత్రం చావు కల వస్తే మంచి జరగబోతోందని. పెళ్ళి కల వస్తే చెడు జరగబోతోందని మనలో మనమే అనేసుకుంటాం. కొన్నిసార్లు పీడకల. ఆ పీడకలలో దయ్యం. ఆ దయ్యాన్ని పరిగెత్తించాలన్న కుతూహలంలో కొందరు తాయత్తు మహిమలు చేయిస్తుంటారు. ఇంకొందరైతే ఏ మొక్కో గుర్తుచేయడానికి సాక్షాత్తూ దేవుడే నా కల్లోకి వచ్చాడు అని చెప్పేస్తుంటారు.

    ”అనుకున్న వారికి అనుకున్నంత వాసుదేవ’ అని ఇలాంటి వారికోసమే అంటారేమో.

    కలలు నిజమో కాదో తెలియదు కానీ వాటి వల్లనే అందరం జీవిస్తున్నాం. అందుకే కలను కలగా మిగిల్చకుండా ఆ కలలను నిజ జీవతంలో మనమందరమూ సాధించుకోవాలనేదే నా ఈ చిన్ని ”కల”!

  • ‘టూ’డేస్‌ లవ్‌

    లవ యూ…! నువ్వు కాదంటే చచ్చిపోతాను అంటాడు ఒకడు, నన్ను ప్రేమించక పోతే చంపేస్తాను అంటాడు మరోకడు ఇదేనా ప్రేమంటే?

    ఎన్నో ఆశలతో, మరెన్నో కోరికలతో యువతరం ముందుకు వెళ్తున్న తరుణంలో ‘ప్రేమ’ అనేది ఒక అత్యవసర చర్యగా ఈ తరం యువతీ యువకులు భావిస్తున్నారు. యవ్వనంలో పుట్టే ఆకర్షణకు ప్రేమ అని పేరును పెడుతున్నారు.

    ఎంత ఎక్కువ మంది గర్ల్‌ఫ్రెండ్స్‌ లేదా బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉండడం అనేది నేటి యువతరంకి ఒక స్టేటస్‌ సింబల్‌గా మారిపోయింది. మా ఇంట్లో దీవీఔ కారు ఉంది అన్నంత గర్వంగా, నాకు నలుగురు గర్ల్‌ ఫ్రెండ్స్‌, బాయేఫ్రెండ్స్‌ ఉన్నారు అని చెప్పుకుంటున్నారు.

    భార్య కోసం తాజ్‌ మహల్‌ను నిర్మించి, తన ప్రేమ కానుకగా ముంతాజ్‌కు అంకితం చేశాడు షాజహన్‌ కానీ అంతే ప్రేమకోసం ఇప్పుడు నేటి సమాజంలో యాసిడ్‌ దాడులు, మహిళలపై అత్యాచారాలూ, లైంగిక వేధింపులూ ఎన్నో జరుగుతున్నాయి.

    మారుతున్న కాలంతో పాటు ప్రేమించే విధానాలు కూడా update (అప్‌డేట్‌) అవుతున్నాయి. ఒకప్పుడు కనులు, కనులు (చూపులు) కలిస్తే ప్రేమ, రెండు మనస్సులు కలిస్తే ప్రేమ. ఇప్పుడు నంబర్లు కలిస్తే ప్రేమ, ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ (Friend Request) Accept చేస్తే, Like లూ, కమెంట్లూ పెడితే ప్రేమ మరింత త్వరగా పుట్టుకొచ్చేస్తుంది.

    ముఖపుస్తకం… అదేనండోయ్‌! Facebook లో ఫ్రెండ్స్‌ అవ్వడం, వాట్సప్‌ లో ఫోటోలు పంపుకోవడం, 4 బంగారాలు, 3 స్వీట్‌ హర్ట్స్‌ తో ప్రేమ మొదలవ్వడం ఒక రోజు కలుద్దాం అనడం మరోక రోజు తిరగడం, ఇంకోక రోజు అంతే సాధారణంగా విడిపోవడం నేటి తరానికి సర్వ సాధారణం అయిపోయింది.

    నేటి ప్రేమ ఇట్టేపుడుతుంది, అట్టే ముగిసిపోతుంది! ఇలా మారుతున్న దశలో ఒకరి అభిప్రాయాలు మరోకరు తెలుసుకుని దగ్గరకవ్వడం సులభమే! కానీ, ఒకరి అహం (ego) తో మరోకరు ఇమడలేక ఎంత త్వరగా అయితే ప్రేమలో పడుతున్నారో, అంతే త్వరగా break-up(బ్రేకప్‌) అవుతున్నారు.

    ఒకరి అభిప్రాయాలను ఒకరు ఉంచుకుని, ఒకరికి ఒకరు తోడూ, నీడగా ఉండే ప్రేమకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఆకర్షణే ప్రధానంగా, మనసులకు బదులు శరీరాలను పంచుకోవడమే ప్రేమ అనే భ్రమలో నేటి యువతరం ఉంది.

    ‘Love is like a flowing water in cascade’  పారే సెలయేటిలోని నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ప్రేమ కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో స్పచ్ఛమైన ప్రేమ అనేది ఆ సెలయేరులో పడి కొట్టుకుపోతుంది. ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండినా… ‘ అనేది ఒకప్పటి పాట ‘నీ కళ్ళు పేలిపోనూ చూడవే మేరే హయ్‌…’ అనేది ఇప్పటి ట్రేండ్‌ ఒకప్పటి ప్రేమ త్యాగానికి ప్రత్యేకత. మరిప్పుడు ప్రేమ అంటే స్వార్థానికి చిరునామా!

    ఇప్పటికైనా యువతరం మేల్కోని ఆకర్షణకీ ప్రేమకీ తేడా తెలుసుకుని, జీవితారంభంలోనే యాసిడ్‌ దాడులు, అత్యాచారాలు వంటినేరాలు చేసి అంతం చేసుకోకండి.

    Just wake up
    Open your heart
    Know the different between
    Love and lust’