నా పేరు ఒరేయ్‌, అందరూ నన్ను ఇలాగే పిలుస్తుంటారు. ఒరేయ్‌ ఏంటీ గమ్మత్తుగా వుందే నీ పేరు వినగానే నవ్వువచ్చేటట్లు! ఇంతకూ ఈ పేరు పెట్టింది ఎవరూ అనేగా మీ ప్రశ్న. నిజానికి దీన్ని పేరు అని అంటారో లేదో కూడా నాకు తెలియదు. మీ అందరికీ నవ్వు తెప్పించే నా పేరు, నాకు మాత్రం ఇలా ఎవరైనా పిలిస్తే బాధగా వుంటుంది. ఎందుకంటే నాకు అమ్మ నాన్న, బామ్మ అందరూ ఉన్నారు కాని వీరిలో ఏ ఒక్కరూ నాకు పేరు పెట్టలేదు. బామ్మ ముసలిది అప్పటి కాలం మనిషి ఏ పేరు పెట్టాలో తోచలేదు. ఇక అమ్మ నేను కడుపులో ఉన్నప్పటి నుండి కూడా పిచ్చిదానిలా తన లోకంలో తను ఉంటుంది. ఈ విషయం నాకు బామ్మ చెప్పింది లెండీ! ఇక నాన్న నా పుట్టుకకు కారణం ఓ మగాడు అని తెలుసు కాని అతను ఎవరో మా అమ్మకే తెలియదు ఇక నాకు ఎలా తెలుస్తుంది. (ఒక వేళ అమ్మకి నాన్న ఎవరో తెలిసినా చెప్పే పరిస్థితిలో లేదు.

ఊహ తెలిసినప్పటి నుంచి బామ్మని అడుగుతూనే ఉన్నా నాన్న ఎవరు? అమ్మ ఎందుకు ఇలా అయ్యిందో చెప్పు అని. సమయం వచ్చినప్పుడు చెబుతా అంటూ మాట దాటేసేది. ఈ విషయంలోనే చాలా సార్లు తనతో గొడవ పడి భోజనం చెయ్యకుండా మారాం చేసేవాడిని కానీ కాసేపటికే బామ్మ ఓదార్పుతో అన్నీ మర్చిపోయేవాడిని. నేను చదువుకోలేదు అమ్మకి అలా ఉండడంతో బామ్మ ఇంటి దగ్గరే వుంటూ పూలు అల్లి అమ్ముతుంది షాప్స్‌కి వేస్తుంది. దండాలు కడుతుంది. అప్పట్లో బామ్మ ఏడోతరగతి వరకూ చదివిదంట. ఆవిడే అక్షరాలు నేర్పింది కొద్దికొద్దిగా రాయగలను కూడా!

నేను మా ఊర్లో జరిగే అన్ని పెళ్ళిళ్ళలో భోజన సమయంలో సప్లయ్‌ చేయడం వంటివి చేస్తాను ప్రతీ పెళ్ళికీ 50 రూపాయలు ఇస్తారు. అందరూ నన్ను ఒరేయ్‌ అని పిలుస్తుంటారు. బామ్మ కొంత చదువుకుంది కదా ఏదైనాపేరు పెట్టి ఉండచ్చు కదా అని చాలా సార్లు అనుకున్నాను. అస్సలు బామ్మ చిన్నప్పుడే నేను ఏదో అల్లరి చేస్తే రెండు అంటిచ్చి ఒరేయ్‌ అని అంది. అప్పటి నుండి నా పేరు ఒరేయ్‌ అని అంది. అప్పటి నుండి నా పేరు ఒరేయ్‌ అయిపోయింది. కనీసం నాకు పేరు పెట్టే వాళ్ళు కూడా లేరే అన్నది నా బాధ. కాళీ సమయంలో మా ఇంటి ముందే ఉన్న సత్తయ్య బాబాయ్‌ దగ్గర చుట్టలు చుడతాను నెలకు 1000 రూపాయలు నా జీతం. బాబాయ్‌ ఇస్తారు నేను బామ్మకి ఇచ్చేవాడిని నన్నూ, అమ్మనూ చూస్తుంది తనేగా.

ఉన్నదాంట్లోనే బామ్మ, అమ్మతో సంతోషంగా ఉండేవాడిని. కానీ రోజూ ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని చూస్తే వాళ్ళతో ఆడుకోవాలి అనిపించేది. కాని వాళ్ళు దగ్గరికి రానిచ్చేవారు కాదు. స్కూల్‌కి వెళ్తూ అమ్మా, నాన్నని కౌగిలించుకుని ప్రేమగా ముదుద్లఉ పెట్టించుకొని టాటా అంటూ వెళ్తుంటే నాతో అమ్మా, నాన్న ఇలా ప్రేమగా వుంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. అమ్మ చేతి గోరుముద్దలు తినలేదు ఈ ఆశ ఎప్పటికి తీరుతుందో. అమ్మతో నేను మాట్లాడటమే గాని తను ఏ రోజూ ప్రేమగా పిలిచింది లేదు. చిన్నప్పుడు ఆకలేసి ఏడ్చిన ప్రతీసారి అమ్మ అంటే బామ్మ పరుగెడుతూ వచ్చేది. నేను బయటికి వెళ్ళితే నన్ను చులకనగా చూస్తూ హేళన చేసేవారు ఎక్కువగా ఉన్నారు. ఎవరికి పుట్టావో తెలీదు, అమ్మ పిచ్చిది, బామ్మ ముసలిది, నువ్వు పనికిరానివాడివి అన్న ప్రతీసారి ఆ మాట నా గుండెల్లో కన్ని లక్షసార్లు కొట్టుకుంది. ఆ నొప్పిని భరించలేకపోయేవాడిని. ఒంటరిగా కూర్చోని ఎన్నోసార్లు వెక్కివెక్కి ఏడ్చానో! నా ఏడుపు నాకు మాత్రమే వినబడేది. మీ నాన్న పేరేమిటి? ఉన్నాడా, చచ్చడా? అసలు ఎవరు? అంటూంటే రాయి ఇచ్చి కొట్టాలనిపించేది. కొన్నిసార్లు ఆ ప్రయత్నం కూడా చేసాను బామ్మ రెండు అంటించి వెనక్కి తీసుకొచ్చేది.

దేవుడంటే కూడా నమ్మకం లేదు అందుకే ఆయనని ఏమని కోరుకోవాలో కూడా తెలీదు. నేను పెద్దవాడిని అయ్యానంటూ బామ్మ మూడు నెలలగా వంట చేయడం కూడా నేర్పింది. నాకు ఇప్పుడు 12 ఏళ్ళు ఎప్పుడు ఏం పాపం చేసానో తెలీదు గానీ ఈ రోజు నా జీవితం అంటే విరక్తి కలుగుతుంది. నేను బతికి ఏం ప్రయోజనం? రోజూ పొద్దున్న లేస్తూనే బామ్మా అని పిలవగానే ఇక్కడే ఉన్నాను అంటూ బదులు వచ్చేది. కానీ, ఈ రోజు ఆ బదులు లేదు. బామ్మ ఎక్కడ ఉందా అంటూ వెతుకుతూ పెరట్లోకి వెళ్ళాను. అక్కడ బామ్మ పడుకుందో, పడిపోయిందో అర్థం కాలేదు. బామ్మా అంటూ పిలిచాను బామ్మ నన్ను దగ్గరికి తీసుకొని నుదిటిపై ముద్దు పెట్టి అమ్మ జాగ్రత్త అంటూ ఓ పేపర్‌ని నా చేతిలో పెట్టి చనిపోయింది. అది చూడగానే భయంతో బామ్మా అంటూ గట్టిగా అరచి స్పృహ తప్పి పడిపోయాను. లేచి చూసే సరికి సత్తయ్య బాబాయి రా అంటూ తీసుకెళ్ళి బామ్మ అంత్యక్రియలు చేయించారు.

అమ్మని చూద్దాం అంటూ ఇంటికి వెళ్ళాను అమ్మ ఆకలి, బామ్మ అంటూ ఏడుస్తుంది. బామ్మ గురించి అమ్మకి చెప్పినా అర్థం కాదు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. బామ్మ బయటికి వెళ్ళింది కాసేపట్లో వచ్చేస్తుంది తిను అమ్మా అంటూ తినిపించాను. బలవంతం గానే కొద్దిగా తినింది. కాసేపు ఆగి కాళ్ళూ, చేతులూ కొడుతూ అరుస్తూ ఉంది. నేను అలాగే చూసాను. బామ్మ ఇచ్చిన పేపర్‌ గుర్తువచ్చింది. చదివాను. ”క్షమంచు మనవడా!” అంటూ మొదలు అయింది. ”నా పేరు యశోదమ్మ. ఎప్పుడూ నన్ను బామ్మ అనే పిలిచేవాడివి నా పేరు కూడా తెలీదుగా అందుకే చెబుతున్న. నా కొడుకులు ఆస్తి లాక్కోని బయటికి గెంటేసారు. మనం ఉంటున్న ఇల్లు మా అమ్మవాళ్ళ ఇల్లు. మీ అమ్మ నా కూతురు కాదు! 14 యేళ్ళ కిందట ఈ ఊరు వచ్చేటప్పుడు మన ఊరి చివర చెరువు దగ్గర ఆత్మహత్య చేసుకోబోతుంటే ఆపి జరిగింది తెలుసుకున్నాను. మీ నాన్న పేరు జగదీష్‌ మీ అ్మని ప్రేమించి మోసం చేసాడు. మూడు నెలల గర్భవతిగా ఉన్న మీ అమ్మను నాతో పాటే తీసుకొచ్చాను. నువ్వు పుట్టాక, సాక్షంగా నిన్ను తీసుకొని మీ నాన్నదగ్గరికి వెళదాం అనుకున్నాం. కానీ మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు ఐదవ నెలలో కింద పడింది. అప్పుడు తలకి దెబ్బ తగిలి అలా పిచ్చిదానిలా అయింది. హాస్పటల్‌ లో చూపించినా అమ్మకి నయంకాదు అన్నారు. ఇదీ నీ గతం అమ్మ జాగ్రత్త!” అంటూ ముగించింది.

అయ్యో బామ్మ నువ్వు లేని జీవితం కష్టం అనుకుంటే, నువ్వు మాకు ఏమీ కావు అన్న నిజం నరకంలా వుంది. మా సొంత బామ్మ కాకపోయినా మా అమ్మకు సొంత అమ్మవు కాకపోయినా బిడ్డలా కాపాడావు ఇన్ని రోజులూ. చిలిపిగా నేను చేసిన అల్లరి నిన్ను బాధపెట్టి ఉంటాయి. చాలా మూర్ఖంగా చేసాను. అమ్మ ఈ సరిస్థితిలో నాన్న గురించి ఏం చెప్పలేదు. నువ్వు చెప్పలేదు. ఇక నాన్న గురించి తెలీదు అనుకున్నాను. అందుకే అమ్మకి విషం పెట్టి నేను ఆ విషం తాగాను అంటూ బోరున ఏడ్చి. అమ్మా! అంటూ అమ్మ దగ్గరికి వెళితే అమ్మ ఒరేయ్‌ అని పిలిచింది. ఎప్పుడు పిలుస్తుందా అని ఇన్ని రోజులూ ఆశగా చూస్తే అమ్మ ఇప్పటికి పిలిచింది. సంతోష పడాలో, బాధపడాలో అర్థం కాలేదు. అమ్మ ఒడిలో పడుకున్నాను. అమ్మలో కదలిక లేదు చనిపోయింది. నా గుండె ఆగిపోయింది.

ఇది కథకాదు నిజం. లోకం మీ నాన్న ఎవరూ అంటూ వేసిన నిందలకి భరించలేక బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు ఒరేయ్‌. ఇలాంటివి మన చుట్టూ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇందులో 13 యేళ్ళ ఒరేయ్‌ తప్పు ఏముంది? అలాంటి వారిని మాటలతో హింసించకండి వీలైతే జీవితం అంటే ఏంటో నేర్పండి, బతకడానికి ఆధారం చూపండి.

Keerthana M

16 thoughts on “పగవాడికి కూడా ఈ జీవితం వద్దు!

  1. నిజం… మీరు చెప్పింది కథ కాదు అక్షరాల నిజ జీవితంలో జరిగే యధార్థ సంఘటనలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి….నా కళ్ల లో కన్నీళ్లు పెట్టించిన మీ ఒరేయ్ కథకు నా చప్పట్లు….
    శివప్రసాద్., సాక్షి జర్నలిస్ట్, చిత్తూరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *