నిన్న మార్కెట్‌లో కూరగాయలు కొంటుంటే అలా నా చెవిలో ఓ మాట వచ్చి పడింది – ‘అబ్బా! ఆ అమ్మాయి భలే అందంగా ఉంది కదరా’ అంటూ ఒక అబ్బాయి నన్ను చూస్తూ తన పక్కన వాడితో చెబుతున్నాడు. ఆ మాటలు విన్న ఏ అమ్మాయికైన కాస్త కోపం వచ్చినా మనసులో మాత్రం గాల్లో తెలిపోతూ, ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. కోపం ఎందుకు? ఎవడో తెలియని వాడు తనగురించి మాట్లాడుతున్నందుకు కోపం వచ్చినా మనసులో కాస్త సంతోషంగానే ఉంటుందండోయ్‌! ఎంతైనా అది పొగడ్త కదా!

కాని ఈ మాట నన్ను ఒక ఆలోచనకు గురి చేసింది. మదిలో ఓ పెద్ద యుద్ధమే అనుకోండి. అసలు ‘అందమైన’ అమ్మాయేంటి? అమ్మాయే అందం. నాకు తెలిసి దేవుడి సృష్టిలో ఓ అపూరపమైన మాయ స్త్రీ. అలాంటి ఆమెను ‘ఆడ’ (అక్కడ) ఉండాల్సిన పిల్ల అంటూ దూరం పెట్టేస్తుంటారు ఎందుకు?

కాటుక కళ్ళు, ముక్కుపుడకతో మురిపించే ముక్కు, పెదవులపై ముసిముసి నవ్వులూ, విశాలమైన నుదురూ, అబ్బా. ఎంత చెప్పినా తక్కువే. ఆడపిల్ల అంటే భారం అంటుంటారు. అందరి భారం మోసే ఆ తల్లి భూదేవి కూడా ఆడదేగా. ఆ విషయం గుర్తేరాదు ఎవరికీ? ఎందుకలా?

నిజానికి చెప్పాలంటే, స్త్రీ కోసమే పుట్టిన ఆభరణాలకే మాటలు వస్తే అవి ఎంత మురిసిపోయేవో? కాని ఏం లాభం? మాటలొచ్చిన ఈ ప్రపంచానికి మాత్రం స్త్రీ అంటే ఎప్పటికీ చులకనే!

ఆమె ఆపాదమస్తకాన్నీ అలంకరించడానికి నైల్‌ పాలిష్‌లూ, గోరింటాకులూ, మెడలోకి గొలుసులూ, చేతికి గాజులూ, కాళ్ళకి పట్టీలూ, నడుముకి వడ్డానమూ, చెవులకి ఝంకాలూ, పాపిడి బిళ్ళా ఇలా ఒకటేంటి, అన్నీ ఆమె కోసమే పుట్టాయి. వీటిని బతికిస్తున్నారే కాని ఆమెను ఎక్కడైనా బ్రతకనిస్తున్నారా?

పాపం! ఆ చిట్టి తల్లి, ఇంటికోసం ఎంత కష్టపడుతుంది. ఇంటికి పనిమనిషిలా, పిల్లలకు అమ్మలా, భర్తకు సుఖాన్నిచ్చే భార్యలా, ఒక కోడలిగా కూతురిగా ఎన్ని పాత్రలు పోషిస్తుంది. అవేవీ గుర్తుపెట్టుకోకుండా పురిటిలోనే చంపేస్తున్నారెందుకు?

నాకు ఎప్పుడూ ఓ అనుమానం ఉంటుంది. అదేంటంటే భర్త కోసం దేవుడి దగ్గర కాంట్రాక్ట్‌ తీసుకుని ఎన్నో స్కీములపేరుతో ఉపవాసాలు ఉంటుంది. అదేనండి! నోములూ వ్రతాలని ఎన్నో చేస్తుంటారుగా మరి ఈ స్కీములన్నీ ఆడవారికే ఎందుకు? మగవారికి వర్తించవా?

అమ్మగారింటి నుండి అత్తగారింటికి పంపిచేటప్పుడు ఇక ‘నీ భర్తే నీకు దేవుడు’ అని చెప్పడమే వింటాం కానీ అబ్బాయికీ ఏ ఒక్కరైనా ‘నీ భార్య నీకు దేవతతో సమానం. ఆమెను మంచిగా చూసుకొ’ అనే ఓ చిన్న మాటకూడా అతడి చెవున పడేయరెందుకు?

ఇంత బంగారు తల్లిని అమ్మ బొజ్జలో ఉన్నప్పుడే చంపేస్తుంటారు ఎందుకు? కానీ… అలా చంపేయడమే ఓ కందుకు మంచిదేమో! ఎందుకనుకుంటుంన్నారా పెరుగుతున్న ఆమె వయసు మీద కన్నేసి ఆమెను మరీ కౄరంగా అత్యాచారం చేసి చంపేస్తున్నారు. ఇంత హింస పెట్టి చంపే బదులు అమ్మ నన్ను నీ కడుపులోనే ‘చంపేసి-బతికించు’ అని ఆ చిన్నారి తల్లి ఏడ్చేస్థాయికి వచ్చేలా ఉందీ లోకం.

‘అన్నయ్యా! అని పిలిచిన ఆమెకు రక్షణ ఇవ్వటం మాని ఆ అన్నే తనపై అఘాయిత్యం చేస్తున్న రోజులివి. చదువు చెప్పే మాస్టారే చప్పుడు చేయకుండా విద్యార్థిని చంపేస్తున్న కాలమిది. ఇలా వాడు-వీడు అనే తేడానే లేదు. ప్రతీ ఒక్కరికీ ‘స్త్రీ’ శరీరం మీదే కన్ను.

కానీ ఒక్క మాట మాత్రం నిజం – ఆమె ఓపికను పరీక్షిస్తున్న ఈ లోకాన్ని అంతు చూడటానికి ఎప్పటికైనా ఆది-పరాశక్తి రానే వస్తుంది. ఆ రోజు పండు వెన్నెలలో నిప్పుల వర్షం కురవడం మాత్రం తధ్యం.

Sravya Bandaru

5 thoughts on “‘అమ్మాయి ఆదిపరాశక్తి’

  1. ఇంత బంగారు తల్లిని అమ్మ బొజ్జలో ఉన్నప్పుడే చంపేస్తుంటారు ఎందుకు? కానీ… అలా చంపేయడమే ఓ కందుకు మంచిదేమో! ఎందుకనుకుంటుంన్నారా పెరుగుతున్న ఆమె వయసు మీద కన్నేసి ఆమెను మరీ కౄరంగా అత్యాచారం చేసి చంపేస్తున్నారు. ఇంత హింస పెట్టి చంపే బదులు అమ్మ నన్ను నీ కడుపులోనే ‘చంపేసి-బతికించు’ అని ఆ చిన్నారి తల్లి ఏడ్చేస్థాయికి వచ్చేలా ఉందీ లోకం.

    Revolutionary thought process. Keep it up.

Leave a Reply to Ramesh Cancel reply

Your email address will not be published.