కల (Dream)

మా ఇంట్లో నాలుగు గదులున్నాయి. ఆ రోజు నేను మా అమ్మ వాళ్ళ బెడ్‌రూమ్‌లో పడుకున్నాను. హాల్లో నుంచి ఏవో చప్పుళ్ళు. అవి కాస్తా మెల్లిమెల్లిగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అది కూడా ఏవో ”గిఫ్ట్‌లు రెడీ కదా!” డెకరేషన్‌ అంతా చేసేసారుగా. కేక్‌ తెచ్చారా? ఇంక తనని లేపుదామా. అని ఏవేవో చిన్న స్వరంలో వినిపించాయి. ఇక నేను మెళ్ళిగా లేచి రూం నుంచి బయటకు వస్తున్నా… అంతే ”హ్యాపీ బర్త్‌డే” అని పెద్దగా అరచేసారు. ఆ అరిచన వారందరూ నా స్నేహితులూ, అన్నయ్యలే. కానీ అందులో ఒక్క మొహం మాత్రం నాకు తెలియదు. తన చేతిలో ఓ గులాబి. తను ఎవరూ అని చూస్తున్నాను. ఇంతలో మోగింది ‘wake up – wake up’ అంటూ అలారమ్‌. టైం చూస్తే ”ఐదు’. కల్లో కూడా పడుకొని కలలు కంటున్నాను చూడండీ….నా మీద నాకే నవ్వొచ్చింది. లేచాక మనసులో ఏదో భావం. ఆలోచిస్తే ఏం గుర్తుకురావడం లేదు. ఇక మా అమ్మ నాన్నతో ఎప్పుడో చెప్పిన మాట గుర్తొచ్చింది. తెల్లవారుఝామున వచ్చిన కలలు నిజమవుతాయని. ఆ ఒక్క మాటతో నా బర్త్‌డే కోసం ఎదురుచూపులు మొదలుపెట్టాను. నాకు తెలిసి ఈ లోకంలోని ప్రతీ మనిషి ఇలాంటి కలలతోనే బతికేస్తున్నారు. రేపో మాపో మంచి రోజులు వస్తాయన్న చిన్న ”కల’. అదే ఆశగా చిగురించి మనల్ని నడిపిస్తుంది. నా విషయానికొస్తే, ‘రేపు’ అనే మాటంటేనే కల.

కొన్ని సార్లు చావు కలలు. కొన్నిసార్లు పీడ కలలు. ఒకసారి పెళ్ళి కల. ఇంకోసారి ”హ్రితిక్‌ రోషన్‌” కల. ఇలా వింత వింత కలలతో మన నిద్ర గడిచిపోతుంది. నిద్రలోనే కాదండోయ్‌ అమ్మా నాన్న కలలను నిజం చెయ్యాలి అనేదీ ఓ కలే! గొప్ప పేయింటర్‌ కావడం ఒక కల. ఇవి అందరి జీవితంలో జరగవు. పట్టుదలతో కృషి చేసి జరగేటట్టు చేసుకునే వారికే ఇవి సొంతం అవుతాయి.

ఈ కలలు నిజాలు కాకపోయినా వాటితోనే జీవితం గడిపేస్తాం. అలా ఎందుకు చేస్తాం? కలల్లో కాలాన్ని వృథా చేసుకోవడం అవసరమా? అని ఒక్కోసారి మీకు మీరే ప్రశ్నించుకోండి? మీకు సమాధానం దొరకదు. దొరికినా మీరు దానితో సంతృప్తి పడరు.

కొన్నిసార్లు అబద్ధమే తీయగా ఉంటుంది అంటాం కదా! ఇది కూడా అంతే. ”కల” ఈ చిన్న కోరిక వల్లే ప్రపంచం నడుస్తోంది. ఇది జరిగినా జరగకపోయినా అందరికి ఇష్టమైనది.

పడుకునే ముందు మనం ఏదో దయ్యం సినిమా చూస్తాం అదేంటో మనకు తెలియకుండానే ఆ దయ్యం మన బుర్రలో తిష్టేసి కూర్చుంటుంది. ఎప్పుడెప్పుడు మనం పడుకుంటామా అని ఎదురు చూస్తుంటుంది. ఎలా అంటే దొంగోడు చీకటి కోసం ఎదిరిచూసినట్టు. మనం అలా రెప్ప మూస్తామో లేదో ఇలా మన కల్లోకి వచ్చి డైరెక్ట్‌గా ముచ్చట్లు పెట్టేస్తుంది. మీకూ ఎప్పుడో ఒకసారైనా ఇలా జరిగే ఉంటుంది కదా!

శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం మన ఆలోచనలు, మన మనసులో రేపటి గురించి ఉన్న ఆతురత, మదిలోని భావాలే ఇలా కలల రూపంలో మనకు దర్శనమిస్తాయట! మన బుర్రంతా వాటి చుట్టూరా తిరగడం వలన ఇలా కలల రూపంలో వస్తాయంట.

కాని మనమందరం మాత్రం చావు కల వస్తే మంచి జరగబోతోందని. పెళ్ళి కల వస్తే చెడు జరగబోతోందని మనలో మనమే అనేసుకుంటాం. కొన్నిసార్లు పీడకల. ఆ పీడకలలో దయ్యం. ఆ దయ్యాన్ని పరిగెత్తించాలన్న కుతూహలంలో కొందరు తాయత్తు మహిమలు చేయిస్తుంటారు. ఇంకొందరైతే ఏ మొక్కో గుర్తుచేయడానికి సాక్షాత్తూ దేవుడే నా కల్లోకి వచ్చాడు అని చెప్పేస్తుంటారు.

”అనుకున్న వారికి అనుకున్నంత వాసుదేవ’ అని ఇలాంటి వారికోసమే అంటారేమో.

కలలు నిజమో కాదో తెలియదు కానీ వాటి వల్లనే అందరం జీవిస్తున్నాం. అందుకే కలను కలగా మిగిల్చకుండా ఆ కలలను నిజ జీవతంలో మనమందరమూ సాధించుకోవాలనేదే నా ఈ చిన్ని ”కల”!

Comments

2 responses to “కల (Dream)”

  1. krishna Avatar
    krishna

    కల గురించి చాలా కళగా చెప్పౌరు స్రౌవ్య గారు

    1. Sravya Bandaru Avatar
      Sravya Bandaru

      thank you.

Leave a Reply to krishna Cancel reply

Your email address will not be published. Required fields are marked *