”చిన్నా, స్వీటీ! లెవ్వండిరా! స్కూల్‌కి టైం అవుతుంది!” అని అమ్మ నిద్ర లేపుతుంది. అప్పుడే పుట్టిన పాపాయి ఫలానా టైంకి పాప పుట్టింది అని డాక్టర్ కన్‌ఫర్మ్ చేసినప్పుడు, ఆ టైం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అనేంతలా ఉంటుంది ఆ క్షణం. సమయం మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. గోడ మీద ఉన్న గడియారం పాడైతే పక్కన పెడతాం కానీ, తెలియకుండానే ఆ గోడవైపు చూస్తాం. చేతికి రోజూ వాచ్ పెట్టుకొని ఒక రోజు పెట్టుకోకపోతే పెట్టుకున్న రోజైనా అన్నిసార్లు చూస్తామో లేదో గానీ పెట్టుకోని రోజు మాత్రం చాలా సార్లు చూస్తాం.
మనకి ఇష్టమైన వారిని కలవాలనుకున్నప్పుడు చెప్పిన సమయం కంటే ఓ పది నిమిషాలు ముందే వెళ్ళిపోతాం. వారితో గడిపిన ఆ కాసేపు, సమయం తెలియకుండానే తొందరగా వెళుతున్నట్లు అనిపిస్తుంది. ఆ నిమిషం అలా ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రిందట కలుసుకున్న స్నేహితులు మళ్ళీ కలవబోతున్నారనుకోండి అందులో ఒక్కరిని కదలించి చూడండి వాళ్ళు వెంటనే మా ఫ్రెండ్స్‌ని కలిసి 3 సంవత్సరాల 4 గంటల 20 నిమిషాలు అని సెకెండ్ కూడా వొదిలిపెట్టకుండా చెబుతారు. మళ్ళీ కలిసే సమయం ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదరుచూస్తూ ఉంటారు.
శుభ కార్యాలకి సమయ ప్రాధాన్యత పెరుగుతుంది, మంచి ముహూర్తం మంచి సమయం కోసం చూస్తారు.
పిల్లల పరీక్షలు రాసేటపుడు పరీక్ష వ్యవధిని తెలుపుతుంది ఈ సమయం.
ఇద్దరు స్నేహితులు కలిసి ఓ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినపుడు ఒకరు ఎంపికయ్యి మరొకరు అవ్వకపోతే నీ టైం బాగుందిరా, నీ టైం నడుస్తుంది కానీవూ… నాకూ టైం వస్తుంది అప్పుడు చెబుతా అంటాడు. అనుకోకుండానే పాపం సమయాన్ని తిడతారు. ”దానికే గనక నోరు ఉంటే నేనేం చేసాను నన్నంటున్నారు” అని అడిగేదేమో. మన దగ్గర ఉన్న వాచ్ ఆగిపోయినా కాలం ఆగదుగా! నిద్రపోయేటప్పుడు అమ్మ పాడే జోల పాటలతో ఎంత హాయిగా పడుకుంటామో అలాగే పొద్దున్నే లేవడానికి అలారం శబ్దంతో రోజు మొదలవుతుంది.
అసలు సమయానికి ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తామోనని ఎప్పుడైనా ఆలోచించామా? నిజానికి అంత ఆలోచించాల్సింది ఏమీలేదు. మనతో ఎవరు ఉన్నా లేకపోయినా సమయం మాత్రం (కాలం) నేను ఆగను అంటూ మన వెంటే నీడలా ఉంటుంది. ఈరోజు నుంచి కాలాన్ని మీ మంచి స్నేహితునిగా చూస్తారు గా!
అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది.వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. అవకాశం మళ్ళీ రాదు మిస్ చేసుకోవద్దు అని అంటారు. మిస్ అయిపోతే ఆ బాధ నుంచి కోలుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. చూసారా నీ సంతోషంలోనే కాదు నీ బాధలోనూ తోడుగా ఉంటాను అంటోంది సమయం. మిమ్మల్ని బాధపెట్టి కాలం కూడా మీ బాధని చూసి ఓర్చుకోలేకపోయింది కాబోలు! మరోసారి అవకాశం ఇచ్చి మీకు సక్సెస్ ఇచ్చింది. అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అనుకున్న వారి ఆలోచనలో ఓ ఆశ కూడా ఉంటుంది. నా సమయం ఎప్పుడూ ఇలాగే ఉంటుందా లేదులే నాకు మంచి రోజులు వస్తాయి అని ఈ ఆశే మన వెంట ఉండి నడిపిస్తుంది కాలం. సమాధానమూ ఇస్తుంది, సహాయమూ చేస్తుంది.
కానీ సమయంతో పాటు ప్రణాళిక ముఖ్యమే. ఈ సమయం లోపు ఈ పనిని పూర్తి చెయ్యాలి అనుకుంటే దానికి పర్‌ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. కానీ కొన్ని సార్లు ఇది తప్పడం వల్లే వైఫల్యాలు వస్తాయి. మరోసారి ఈ తప్పు జరగకుండా చూసుకోండి.
- క్షమించండి మీ రిషికేశ్వరి - July 31, 2015
- నేనంటే అంత చులకనెందుకు - June 3, 2015
- పగవాడికి కూడా ఈ జీవితం వద్దు! - February 1, 2015